ఆగష్టు11న విడుదలైన నితిన్- హనురాఘవపూడిల 'లై', బోయపాటి శ్రీను 'జయ జానకి నాయకా', రానా -తేజల 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు బాగానే ఉన్నాయి. కానీ ఒకేసారి మూడు చిత్రాలను చూడలేని సామాన్య ప్రేక్షకులను ఇవి పంచుకున్నాయి. కొత్త రకం కథ, స్క్రీన్‌ప్లే, ఇంటెలిజెంట్ సబ్జెక్ట్‌తో వచ్చిన 'లై' చిత్రం సోలోగా వచ్చి ఉంటే ఆహా ఓహో అనేవారు. ఇక మాస్‌ని విపరీతంగా ఆకట్టుకున్న 'జయ జానకి నాయక' కూడా సోలోగా వచ్చి వుంటే కలెక్షన్లు కుమ్మేసి ఆహా ఓహో అనిపించే రేంజ్‌కి వెళ్లేది. ఇక డిఫరెంట్ క్లైమాక్స్‌తో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'కి మంచి టాక్ ఉన్నా కలెక్షన్లు తగినట్లుగా లేవు. అలాగని ఈ మూడు చిత్రాలు బాగోలేదని ఎవ్వరూ అనరు. మూడు చిత్రాలు బాగున్నాయనే అంటున్నారు.
దీంతో పోటీకి పోయి సినిమాలపై సినిమాలు విడుదల చేస్తే ఎంత ప్రమాదమో సురేష్‌బాబు, దిల్‌రాజు వంటి వారు తెలుసుకోవాల్సివుంది. ఇక ఈనెల చివరి వారం కూడా భారీగానే చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఎన్నో అంచనాల మద్య ఎంతో నమ్మకంతో 'పెళ్లిచూపులు' హీరో విజయ్‌దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' ఎప్పుడో ఆగష్టు25ని లాక్ చేసింది. ఇప్పుడు నారా రోహిత్, నాగశౌర్యలు హీరోలుగా నటిస్తున్న 'కథలో రాజకుమారి' కూడా అదే తేదీన వస్తోంది. ఇక తమిళస్టార్ అజిత్ నటించిన శివ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న 'వివేగం' వంటి భారీ చిత్రం, తెలుగులో తనకున్న ఏకైక హిట్ 'రఘువరన్ బిటెక్'కి సీక్వెల్‌గా సౌందర్య రజనీకాంత్ డైరెక్షన్‌లో అమలాపాల్, బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కాజోల్ , ధనుష్‌లు పోటాపోటీగా నటిస్తోన్న 'విఐపి2'లు కూడా అదే రోజున విడుదల కానుండటం విశేషం. ఈ మధ్యలో అంటే ఆగస్ట్ 18 న తాప్సి ఆనందో బ్రహ్మ పలకరించనుంది.