నేడు చిన్న చిన్న పట్టణాలలో కూడా మల్టీప్టెక్స్‌ల హవా నడుస్తోంది. అలా స్క్రీన్‌లు ఎన్నో ఉండే థియేటర్లలో ఒక పెద్ద హీరో నటించే చిత్రం విడుదలైతే పక్క స్క్రీన్‌లో ఆడే సినిమాలు చిన్నవైనా సరే పెద్ద చిత్రాల ఓవర్‌ఫ్లోని కాస్తైనా క్యాష్ చేసుకునే స్థితి ఉంటుంది. అందునా ఓ మాస్ హీరోకి చెందిన యాక్షన్ చిత్రానికి కామెడీ నిండిన ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ ఫీల్‌గుడ్ మూవీ పోటీకి వస్తే కాస్తైనా మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అదే తరహాలో కామెడీ హీరో సునీల్, ఆయన చిత్ర నిర్మాతలు, దర్శకుడు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. గత కొన్నేళ్లుగా యావరేజ్ హిట్ లేని సునీల్ చిత్రం సోలోగా వచ్చినా థియేటర్‌కి ప్రేక్షకులు వెళ్లరు. అదే పెద్ద సినిమాతో కలిసి వస్తే దాని ఓవర్‌ఫ్లోతో మంచి మౌత్‌టాక్ తెచ్చుకుంటే చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ అయిన వస్తాయని భావిస్తుండటం వల్లే పూరీ జగన్-నందమూరి బాలకృష్ణ- భవ్యఆర్ట్ప్ చిత్రం 'పైసా వసూల్' కి పోటీగా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
సెప్టెంబర్1న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 'పైసా వసూల్' రిలీజ్ కానుంది. దీంతో బాలయ్య అభిమానులతో పాటు ఆయన యాంటీ ఫ్యాన్స్ కూడా ఆ చిత్రం కోసం ఎంతో ఉత్సుకతగా చూస్తున్నారు. ఈ సమయంలో బాలయ్య 'పైసా వసూల్' కి కావాలని నెగటివ్ ప్రచారం చేసే వారి చేతిలో సునీల్ చిత్రం అస్త్రంగా మారనుంది. ఈ సునీల్ చిత్రం 'ఉంగరాల రాంబాబు' ఎలా ఉన్నా సరే నందమూరి యాంటీ ఫ్యాన్స్ 'ఉంగరాల రాంబాబు'ని పనికట్టుకుని మోస్తారు.
దీంతో 'పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుండగా, ఫీల్‌గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న సునీల్, మియా జార్జ్‌ల 'ఉంగరాల రాంబాబు' చిత్రం పక్కరోజున అంటే సెప్టెంబర్ 2న పని గట్టుకుని మరీ పోటీలోకి దించుతున్నారు. మరి పక్కా యాక్షన్ మూవీగా బాలయ్య, పూరీల సత్తా చూపించనున్న 'పైసా వసూల్' చిత్రం పుణ్యమా.. అని సునీల్ సినిమా కూడా పది మంది నోట్లో నానడం, ఫ్రీపబ్లిసిటీ కిందనే భావించాలి. మరి ఈ మంత్రం ఏ మేరకు ఉంగరాల రాంబాబుపై పనిచేస్తుందో వేచిచూడాల్సివుంది...!