నేడున్న మాస్ అండ్ యాక్షన్ దర్శకుల్లో బి.గోపాల్, వినాయక్‌ల తర్వాత బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలయ్యతో ఆయన తీసిన 'సింహా' ఓ సంచలనం. అప్పటివరకు ఎవ్వరు చూపని విధంగా బాలయ్య స్టైల్‌ని, స్టోరీని, కథను ఎంపిక చేసుకుని 'సింహా'తో బాలయ్యకి పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత 'లెజెండ్'తో చరిత్ర తిరగరాశాడు. త్వరలో చిరంజీవి హీరోగా నటించే 152 వ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌లో చేయనున్నాడు. ఇప్పటికే మామూలు కంటెంట్‌తో 'సరైనోడు'లో అల్లుఅర్జున్ హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించాడు.
ఇక తాజాగా ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యాజైస్వాల్, కేథరిన్, జగపతిబాబు, శరత్‌కుమార్‌లతో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలోభారీ బడ్జెట్‌తో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా 'జయ జానకి నాయక' చిత్రం చేశాడు. ఈ చిత్రం తాజాగా విడుదలై బోయపాటి మార్కును మరోసారి రుచి చూపించింది. ఇక చాలా ఏళ్ల కిందటి నుంచి డైరెక్టరే కెప్టెన్ అని చెప్పే దాసరి సినిమా ప్రమోషన్లు, పోస్టర్లపై దాసరి నారాయణరావు అనే పేరును ప్రత్యేకంగా వేసుకునే వాడు. ఆ తర్వాత రాజమౌళి తనపేరు మీదనే ఓ స్టాంప్ ముద్రను ప్రింట్ చేసి కొత్తరకంగా నటీనటులతో పాటు తనను చూసి కూడా థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారని నిరూపించాడు. ఇక పలువురు దర్శకులు సినిమాలలో కూడా ఏదో ఒక సీన్‌లో కనిపిస్తుంటారు.
ఇక తన చిత్రంలో లైట్, సౌండ్, కెమెరా, యాక్షన్ అంటూ చెప్పే బోయపాటి శ్రీను ఇందులో బోయపాటి ఇంగ్లీషు స్పెల్లింగ్‌లోని 'ఓ' ఇంగ్లీషు అక్షరంలో సింహాన్ని చూపిస్తూ దానిని జూమ్ చేసి, అందులోంచి సినిమా మొదలయ్యేలా చూసుకున్నాడు. మొత్తానికి నటీనటులతో సంబంధం లేకుండా దాసరి, రాజమౌళిల లాగా సినిమాకు కెప్టెన్ డైరెక్టరే అని చెబుతూ, తనదైన ప్రత్యేకత కోసం ఈ విధంగా తన పేరును స్టైలిష్‌గా చూపించాడు. సో.. రాబోయే చిత్రాలలో కూడా బోయపాటి శ్రీను ఇదే బ్రాండ్ ని కంటిన్యూ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.