నేడు ఏ హీరోయిన్‌ని అడిగినా తెలుగులో ఏ హీరోతో చిత్రం చేస్తుంటే వారి భజనే చేస్తుంటారు. ఇక తెలుగులో ఎవరితో నటించడానికి ఇష్టపడతారు అని అడిగితే మహేష్, పవన్, ప్రభాస్‌ల పేర్లు ఎక్కువగా చెబుతున్నారు. ఇక హీరోయిన్లకు ఈ హీరోలతో పనిచేసే అవకాశం వస్తే కొండనెక్కినట్లూ ఫీలవుతున్నారు. ఎంతో అందం, టాలెంట్ ఉంటే గానీ మహేష్‌తో కలిసి నటించే అవకాశం రాదు. ఇక కొరటాల - మహేష్‌ల కాంబినేషన్ చిత్రం అంటే ఇక చెప్పనవసరం లేదు. వీరి గత చిత్రం 'శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ కాంబినేషన్‌లో చిత్రం చేయాలని ఎవ్వరైనా కోరుకుంటారు. ఇప్పుడు 'ఎం.ఎస్.ధోని' చిత్రంలో నటించిన కైరా అద్వానికి ఇంత త్వరగా ఈ అవకాశం రావడం అంటే మాటలు కాదు. ప్రస్తుతం ఆమె కొరటాల, మహేష్‌ల 'భరత్ అనే నేను' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ, మహేష్ గారితో చేయడం నాకు పూర్వజన్మ సుకృతం. నా ఫిల్మ్‌కెరీర్‌లోనే ఇది అత్యంత అరుదైన అవకాశం. నా సంతోషాన్నిచెప్పడానికి నాకు మాటలు చాలడంలేదు. నాకల ఇంత తొందరగా నెరవేరుతుందని కలలో కూడా భావించలేదు. నా మొదటి చిత్రమే మహేష్ అంటే ఇంక అంత కంటే అదృష్టం ఏముంటుంది? మహేష్ మరియు కొరటాల గారి కాంబినేషన్‌లో అతి పెద్ద హిట్ ఆల్‌రెడీ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలుంటాయని నాకు తెలుసు. అందరికీ నచ్చేలా ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే సంక్రాంతికి తెలుగు వారి పెద్ద పండుగైన రోజున ఈ చిత్రం రిలీజ్ కానుంది.. అంటూ ఎంతో తన్మయత్వంతో చెబుతోంది ఈ అమ్మడు.
ఒకవైపు మొదటి తెలుగు చిత్రంలోనే ఆమెకు మహేష్ బాబు సరసన నటిస్తున్న ఆమె అదృష్టాన్ని అందరూ పొగుడుతుంటే, ఆమె మహేష్‌ని విపరీతంగా పొగడ్తల జడివానలో ముంచెత్తుతోంది. మరి ఈ అమ్మడు కృతి సనన్‌లా మారుతుందో? లేక సక్సెస్‌ఫుల్‌గా నిలుస్తుందో వేచి చూడాల్సివుంది..!