పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తేజ హీరోగా రానా దగ్గుబాటి నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక కాజల్, కేధరిన్‌లు నటించిన ఈ చిత్రానికి మాటలను లక్ష్మీభూపాల అందించాడు. ఇక ఈ చిత్రంలోని ఓ డైలాగ్ మాత్రం సంచలనంగా మారింది. వంద మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌లో ఉంచితే నేను కూడా సీఎంగానే అని నాటి ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయాలపై, తమిళనాడు పాలిటిక్స్‌లోని చిన్నమ్మ శశికళ నిర్వహించిన ఎమ్మెల్యేల బందీఖానాలకు అద్దం పట్టేలా రాసిన డైలాగ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్స్‌లో విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక దానిని మించిన మరో డైలాగ్ ఇప్పుడు థియేటర్లలో మేధావుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరినీ అలరిస్తూ ఆ డైలాగ్‌తో థియేటర్లలో చప్పట్లు, కేరింతలు పడేలా చేస్తోంది. 'సినిమాలలో నటించిన మహానుబాహుడు పార్టీ పెడితే అక్కడా మేమే.... ఒక మాస్ హీరో పార్టీ పెడితే అక్కడా మేమే, విప్లవభావాలున్నాయన పార్టీ పెడితే అక్కడా మేమే, రేపింకెవరైనా పార్టీ పెడితే అక్కడా మేమే.. ఏ పార్టీ గెలిచినా, ఏ కొత్తనేత పార్టీ పెట్టినా...మేము మాత్రం అధికారంలో ఉంటాం...' అని రాసిన ఒకే డైలాగ్‌తో గోడ మీద పిల్లుల వంటి నాయకులను, జంపింగ్ జపాంగ్‌లను, ఆయా రాం గయారాం వంటి వారిని బాగా ఎండకట్టాడు.
ఇక సినిమాలలో నటించిన ఓ మహానుబాహుడు అంటూ నాటి ఎన్టీఆర్ టిడిపిని, ఓ మాస్ హీరో అంటే చిరంజీవి ప్రజారాజ్యంని, ఓ విప్లవ భావాలున్న ఆయన అనడం ద్వారా పవన్‌కళ్యాణ్ 'జనసేన'కు వర్తించేలా ఒకే డైలాగ్‌తో అందరినీ కడిగిపారేశాడు. పదవుల కోసం, ఏ పార్టీలో ఉంటే గెలుస్తామో ఊహించి వాటిల్లోకి జంప్ అయ్యే రాజకీయనాయకులను ఉద్దేశించిన ఈ డైలాగ్ ఈ చిత్రానికే ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవాలి..!