సౌతిండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరు దేవిశ్రీప్రసాద్. ఈ సంగీత సంచలనం ఈ ఏడాది ఇప్పటికే 'ఖైదీనెంబర్150, నేను..లోకల్, రారండోయ్ వేడుక చూద్దాం, డిజె' వంటి చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'జయ జానకి నాయకా' చిత్రానికి కూడా అదిరిపోయే సంగీతం అందించాడు. ఆగష్టు11న విడుదలవుతున్న ఈ చిత్రం సంగీతపరంగా కూడా మంచి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు దేవిశ్రీ స్వరపరిచిన 'రింగ రింగ,... ఆ.. అంటే అమలాపురం' వంటి పాటలు బాలీవుడ్‌ని కూడా ఎంతగానో ఆకర్షించాయి. ఇప్పటికీ బాలీవుడ్ నుంచి దేవిశ్రీకి రోజుకో ఆఫర్ వస్తూనే ఉందట. కానీ బాలీవుడ్‌కి తాను వెళ్లనని స్పష్టం చేశాడు. దీనికి ఆసక్తికరమైన సమాధానం కూడా చెప్పాడు. బాలీవుడ్‌లో ఒకే సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పనిచేయడం అరుదు. ఒక్కో పాటను ఒక్కొక్కరు కంపోజ్ చేస్తుంటారు. నాకు అది నచ్చదు, నేను కథ వింటే అందులో లీనమైపోతా. దానికి సంబంధించిన ట్యూన్స్‌ని ఎలా ఇవ్వాలి? నేపధ్య సంగీతం ఎలా ఉండాలి? అనే వాటిల్లో నేను మునిగిపోతాను, ఎవరి అభిరుచి వారిది.
బాలీవుడ్‌లో ఆ పరిస్థితి ఉండదు. ఒకే సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం వలన సరైన అవుట్‌పుట్‌ని మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వలేడని నా ఉద్దేశ్యం. నేను డబ్బు కంటే సంగీతాన్ని ప్రేమిస్తాను. కేవలం డబ్బు కోసమే పనిచేయడం నాకు చేతకాదు.. అని తేల్చిచెప్పాడు. నిజమే.. ఆయన చెప్పిన పాయింట్ ఎంతో సమంజసంగా ఉందనే చెప్పాలి...!