ఆగష్టు 11న లాంగ్‌వీకెండ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం మూడు యంగ్‌హీరోల చిత్రాలు పోట్లగిత్తల్లా పోటీపడనున్నాయి. నితిన్ 'లై', రానా 'నేనే రాజు నేనే మంత్రి', బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక'లు పోటీలో ఉన్నాయి. ఇక 'లై, జయ జానకి నాయక'చిత్రాలను దిల్‌రాజే విడుదల చేస్తున్నాడు. మరోపక్క బోయపాటి 'జయ జానకి నాయక'ని ఒకరోజు ముందు రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్ల నుండి ఒత్తిడి వస్తుంది.
వీకెండ్ వరకు ఏయే ధియేటర్లలో ఏ సినిమా రిలీజ్ అయినా లాంగ్‌వీకెండ్ ముగిసిన తర్వాత ఏ చిత్రం టాక్, కలెక్షన్లు బాగుంటే వాటినే తమ థియేటర్లలో రిలీజ్ చేసి, థియేటర్లను పెంచే ఉద్దేశ్యంలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఇక వాస్తవానికి 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్ని మొదట ఆగష్టు 18న లేదా 25న విడుదల చేయాలని భావించారు.కానీ తమిళంలో అజిత్ 'వివేగం' పోస్ట్‌పోన్ కావడంతో వారు కూడా ఆగష్టు 11కి రెడీ అయ్యారు. ఈ మూడు చిత్రాల విషయంలో రెండు చిత్రాలను విడుదల చేస్తున్న దిల్‌రాజు, సురేష్‌బాబుల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని సమాచారం.
మరోవైపు ఆ.. నలుగురిలో దిల్‌రాజుకి అల్లు అరవింద్‌తో మంచి స్నేహం ఉంది. దాంతో వారిద్దరి మధ్య సీక్రెట్ అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. కానీ ఆస్థాయిలో దిల్‌రాజుకి, సురేష్‌బాబుకి సాన్నిహిత్యం లేదు. ఇక తన రెండు చిత్రాలను తనకున్న పలుకుబడితో దిల్‌రాజు థియేటర్లను ఆక్రమిస్తూ సురేష్‌బాబు కంటే ముందుండి, ప్రమోషన్స్‌ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక తాజాగా సురేష్‌బాబు మాట్లాడుతూ ఒకే రోజున రెండు మూడు చిత్రాలు విడుదల కావడం మంచిది కాదని, దీనివల్ల అందరూ నష్టపోతారని చెబుతున్నాడు.
ముందుగా అనుకున్న తేదీకే విడుదలవుతున్న 'లై,జయ జానకి నాయక'లను తప్పుపడుతూ, అసలు ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుకు తన చిత్రాన్ని కదిపిన తప్పు తనదే పెట్టుకుని సురేష్‌బాబు ఇలా ఓకే రోజు సినిమాలు నష్టం అని సన్నాయి నొక్కులు నొక్కడం, తన చిత్రాన్ని ముందుకు జరిపిన దానికి కుంటిసాకులు చెప్పడం చూస్తే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇక 'నేనే రాజు నేనే మంత్రి'తనకు బాగా నచ్చిందని, ఈ చిత్రం తన కళ్ల వెంట కన్నీరు కూడా తెప్పించిందని సురేష్‌బాబు చెబుతున్నాడు.