లోకనాయకుడు కమల్ హాసన్ తమిళంలో హోస్ట్ చేస్తోన్న 'బిగ్ బాస్' రియాల్టీ షో పలు సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గతంలో కూడా తమిళంలో పలు టీవీ షోలు ఇలా వివాదాలకు గురైనా కమల్ హాసన్ ఉండటంతో ఇది కొత్త మలుపులు తిరుగుతోంది. అసలే వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కమల్ తన తాజా వ్యాఖ్యలతో ఈ వివాదాల ఘాటును మరింత పెంచి వేడిరాజేశాడు. ఈషోలో మురికివాడల్లో నివసించే స్లమ్ పీపుల్ మీద చేసిన వివాదాస్పద కామెంట్లే దీనికి మూలకారణం.
ఈ వ్యాఖ్యలను అందరూ ఖండిస్తూన్నా, కమల్ మాత్రం తగ్గడం లేదు. సరికదా మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్‌పై ఈ విషయంలో పరువు నష్టం దావా వేసిన ప్రముఖ తమిళ సంస్థ నాయకుడు డాక్టర్. కృష్ణమూర్తిపై కమల్ తనదైన శైలిగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నేను కూడా 100కోట్ల క్లబ్‌లో చేరిపోయాను. కృష్ణమూర్తి నాపై వేసిన 100కోట్ల పరువు నష్టం దావాతోనే ఇది సాధ్యమైంది. సాధారణంగా వందకోట్ల క్లబ్‌లో చేరడం కూడా ఎంతో ప్రతిష్టాత్మకమే. దానిని ఓఅచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను.
డబ్బుల అవసరం ఉన్నవారు ఇలాంటి పనుల ద్వారా ఏమైనా డబ్బులొస్తాయేమో అనే ఆశతో ఉంటారు. ఇక తాము ఎలాగూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేం గనుక ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు.అయినా నేను పదిపైసలు కూడా ఇవ్వను. నేనో విచిత్రమైన జంతువుని, స్వేచ్చగా పుట్టాను. స్వేచ్చగా జీవించడానికి పోరాడుతాను. అలాగే చస్తాను.. అనే వ్యాఖ్యలతో కమల్ అగ్నికి ఆజ్యం పోశాడనే చెప్పాలి..!