పీకేకి కౌంటర్ ఇచ్చిన పీకే.. అన్నయ్యనే కాదనుకున్నాను.. నాకు ఇదో లెక్కా...?
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందన్న వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)కి జనసేనాధినేత పవన్‌కల్యాణ్ (పీకే) గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఏపీలో ఎవరి బలాలు వారికున్నాయని, దీనిపై తాను మాట్లాడదలుచుకోలేదని పవన్ దీటుగా స్పందించారు. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే జనసేన బలం తెలుస్తుందన్నారు. అక్టోబర్ నుంచి వారానికి మూడు రోజులు రాజకీయాలు, ప్రజాసమస్యలకే గడుపుతానని ప్రకటించారు. పార్టీ నిర్మాణమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని తెలిపారు. టీడీపీతో రహస్య స్నేహం ఉందా? అని ప్రశ్నించినప్పుడు దానిని ఆయన ఖండించారు.
గత ఎన్నికలలో బిజెపి-టిడిపిలకు బహిరంగంగానే మద్దతిచ్చానని, ప్రజాసమస్యలపై కామన్ మినిమమ్ ప్రోగ్రాం తయారు చేసుకున్నామని, గతంలో టిడిపిని కూడా తాను విమర్శించానని, రహస్య స్నేహాలు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, రాజకీయాలలో అభిప్రాయ బేధాల వల్ల అన్నయ్యను, బంధుత్వాన్నే వదులుకున్న నాకు ఈ రహస్య స్నేహాలు ఒక లెక్కకాదని, స్నేహం చేయదలిస్తే పబ్లిగ్గా చెప్పేచేస్తానని ప్రకటించారు. ప్రజాసమస్యల తర్వాతే ఈ స్నేహాలు అంటూ తేల్చేశారు. మీరు ప్రజానాయకులా, రాజకీయనాయకులా? అన్నదానికి సమాధానం చెబుతూ, నాకు ప్రజలే ముఖ్యం, వారి సమస్యలే నా అజెండా.. దానిని బట్టి నేను రాజకీయ నాయకుడినా లేక ప్రజానాయకుడినా అనేది మీరే నిర్ణయించుకోండి అని తేల్చేశారు.
జగన్ అక్టోబర్ నుంచి చేసే పాదయాత్ర గురించి ఒక విలేకరి ప్రశ్నించగా, పాదయాత్రలు చేస్తేనే రాజకీయాలు అంటే ఎలా? పాదయాత్రల ముఖ్యోద్దేశ్యం ప్రజల సమస్యలను గూర్చి తెలుసుకోవడమేనన్నారు. తనకు ఉద్దానం సమస్య పాదయాత్ర చేస్తేనే తెలియలేదుకదా..! ప్రజలను చేరుకోవడానికి ఒక్కో రాజకీయనాయకునికి ఒక్కో మార్గం ఉంటుందన్నారు. పాదయాత్రలపై సానుకూలంగా స్పందించిన ఆయన పవన్‌ని కాబోయే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేస్తుంటే వారించారు. పాదయాత్రలు, రోడ్‌షోలు, సభలు,సమావేశాలు అన్నింటి అంతిమలక్ష్యం ప్రజలకు చేరుకునే మార్గమేనని స్పష్టం చేశారు.