వాస్తవానికి నందమూరి నటసింహం బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ఎంతో అందంతో పాటు చలాకీతనంతో అనర్ఘళ ప్రసంగాలతో ఈ మద్య వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు తండ్రికి తగ్గ తనయగా, లోకేష్‌కి భార్యగా, చంద్రబాబు నాయుడుకి కోడలిగానే కాదు.... తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ వ్యవహారాలన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటోంది. తాజాగా ఆమె ఫిక్కీ సదస్సులో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు సినిమాలలోకి, రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, తమ హెరిటేజ్ సంస్థను దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలపడమే తన లక్ష్యమని తెలిపింది.
10 లక్షల మంది రైతులకు హెరిటేజ్ సంస్థ సేవలు అందిస్తోందని, అంతకంటే తనకేం కావాలని ప్రశ్నించింది. కుటుంబ సహకారం వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. హెరిటేజ్ వ్యాపారాన్ని రాబోయే ఐదేళ్లలో 60వేల కోట్ల టర్నోవర్‌ని సాధించేలా చూడటమే తన లక్ష్యమని తెలిపింది. డెయిరీ రంగంలో రిలయన్స్ డెయిరీ కొనుగోలు పూర్తయిందని, ఈ రంగంలో మరిన్ని కంపెనీలను కూడా కొనేందుకు సిద్దంగా ఉన్నామంది. ఈ సందర్భంగా బ్రాహ్మణి భర్త నారా లోకేష్ కూడా ఆసక్తికరంగా మాట్లాడారు.
'బ్రాహ్మణి, మా అమ్మ బాగా కష్టపడుతున్నారు. ఇక నేను, నాన్న కూడా ఎంతో కష్టపడుతున్నాం. ఆడవారి సమస్యలపై ఫిక్కీ సదస్సులో చర్చించాం. చాలా మంది మహిళలు వారి ఆలోచనలను తెలియజేశారు. పాఠశాల పిల్లలకు ఉచితంగా పాలు ఇవ్వమని సూచించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాను. ఇంట్లోనే కాదు.. రాజకీయాలలో కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. టిడిపిలో మొదటి నుంచి మహిళలకు పెద్ద పీట వేస్తున్నాం.. ' అని తెలిపాడు.