ఫిదా తో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇక్కడ అందరికి భానుమతిగా గుండెల్లో కొలువైపోయింది. ఫిదా చిత్రం చూస్తున్నంతసేపు అందరూ సాయి పల్లవి నటనకే ముగ్దులైపోయారు. ఆమె నటన, ఎక్సప్రెషన్స్, డాన్స్ ఇలా అన్నిటిలో చితక్కొట్టేసిన సాయి పల్లవి కథ నచ్చితేనే సినిమా చేస్తానని అంటుంది. కథ నచ్చకపోతే కోట్లు పోసినా నటించనని తెగేసి చెప్పి అందరికి షాక్ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. తాను రీమేక్ సినిమాల్లో నటించనని చెప్పేసి అందరిని షాక్ కి గురిచేసింది.
ఫిదా చిత్రాన్ని తమిళం లేదా మలయాళంలో రీమేక్ చేస్తే మళ్లీ మీరే నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు.... ఫిదా రీమేక్ లో నటించనని... చేసిన పాత్రనే మళ్లీ చేస్తే మజా ఉండకపోగా... మళ్లీ అంతటి ఎక్సప్రెషన్స్ పండించడం కుదరదని చెబుతుంది. ఒరిజినల్ కథలో నటించినంతగా రీమేక్ లో నటించలేకపోవచ్చు... అలాగే ఒరిజినల్ కి వచ్చినంత రెస్పాన్స్ మళ్లీ రీమేక్ కి వస్తుందనే గ్యారెంటీ కూడా లేదని... అందుకే రీమేక్ లో చచ్చినా నటించనని తెగేసి చెప్పేస్తుంది.
ఇకపోతే ఒరిజినల్ కథలో నటించడం... అలాగే ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే తనకు ఇష్టమని..... అప్పుడు మాత్రమే ఆ పాత్రపై తమదైన ముద్ర వేయగలమని చెబుతుంది సాయి పల్లవి. ఇక ప్రేమమ్ లో మలార్ పాత్ర, ఫిదాలో భానుమతి పాత్రలు క్లిక్ అవ్వడానికి కేవలం కథ ఒరిజినల్ అవడమే అని అంటుంది. అయితే సాయి పల్లవి కేవలం ఫిదా రీమేక్ లోనే కాదు మరే ఇతర రీమేక్ లోను నటించనని చెబుతున్న ఈ భామ ప్రస్తుతానికి నాని సరసన దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఎంసీఏ చిత్రంలో నటిస్తుంది.