టాలీవుడ్ లో రైటర్ గా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా యూటర్న్ తీసుకున్న కొరటాల శివకి... టాలీవుడ్ లో డీసెంట్ డైరెక్టర్ గానే మంచి పేరుంది. ఆయన తన సినిమా కథలను సమాజానికి ఎదో ఒక మెస్సేజ్ ఇచ్చేలాంటివాటినే ఎంచుకుంటాడు. కేవలం మూడు సినిమాలనే డైరెక్ట్ చేసినా కూడా ఆ మూడు సినిమాలు సూపర్ హిట్స్ అవడంతో.... ఆయన చూపు స్టార్ హీరోల మీద నుండి తిప్పుకోకుండా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ తో 'మిర్చి', మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' చేసిన కొరటాల మళ్ళీ మహేష్ తో 'భరత్ అను నేను' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే మహేష్ సినిమా పూర్తవ్వగానే మెగా హీరో రామ్ చరణ్ తో మరో సినిమాకి అప్పుడే కమిటయ్యాడు కూడా.
ఇక ఎప్పుడూ ఏ విషయంలోనైనా ఎటువంటి కామెంట్స్ చెయ్యకుండా ఉండే ఈ దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ ని పట్టి కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించాడు. అసలు డ్రగ్స్ కంటే అవినీతి అనేది సమాజానికి మరింత ప్రమాదకరమైందని..... అవినీతిని నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు ప్రభుత్వాలు గనక తలచుకుంటే ఇది సాధ్యమేనని కూడా కొరటాల శివ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
మరి కొరటాల - మహేష్ కాంబోలో తెరకెక్కే 'భరత్ అను నేను' చిత్రంలో మహేష్ ని పొలిటిషియన్ గా చూపిస్తూ.. అవినీతి నిర్మూలనకు ఆ పొలిటీషియన్ ఎంతగా కృషి చేస్తాడో అనేది దీనిలో చూపించబోతున్నాడా? ఏమో మరి సోషల్ మీడియాలో అవినీతిపై ఇంత తీవ్రంగా మండిపడిన కొరటాల ఈసారి పక్కగా తన సినిమాలో అవినీతి నిర్మూలన అనే అంశంపైనే ఎక్కువ దృష్టి సారించేలా కనబడుతున్నాడు.