రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్ పతాకంపై 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత తన కొణిదెల బేనర్‌లోనే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం భాగస్వామ్యంతో కొరటాల శివతో చిత్రం కూడా ఖరారైంది. తాజాగా ఆయన దిల్‌రాజు బేనర్‌లో 'సినిమా చూపిస్తమావా,నేను లోకల్' చిత్రాలతో రెండు మంచి విజయాలు సొంతం చేసుకున్న త్రినాధరావ్ నక్కినతో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ చిత్రంలో స్టోరీలైన్ దిల్‌రాజుకు బాగా నచ్చిందని, దానిని చరణ్‌కి వినిపించడం, ఆయన ఫుల్‌స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పడంతో ప్రస్తుతం దర్శకుడు త్రినాధరావు నక్కిన తన రచయితలు, అసిస్టెంట్లతో కలిసి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఇక ఈయన ఫ్యామిలీ చిత్రాలకు మాస్ టచ్ ఇచ్చి, అందరికి నచ్చేలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో చిత్రాలు తీయడంతో మంచి పట్టు ఉందని ఆయన కిందటి రెండు చిత్రాలునిరూపించాయి.
దాంతో చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా అల్లు రామలింగయ్య-నిర్మలమ్మల కాంబినేషన్‌లో జయకృష్ణ నిర్మాతగా, బాపు దర్శకత్వం వహించిన 'మంత్రిగారి వియ్యంకుడు' స్టోరీ పాయింట్‌ని తీసుకుని, మాస్, యూత్, క్లాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఇది మంచి యూనివర్శల్ సబ్జెక్ట్ కావడం, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌కి అవకాశం ఉండటంతో ఈ స్టోరీలైన్‌ని త్రినాధరావు నక్కిన, దిల్‌రాజులు దీనికి ఓటేశారని అంటున్నారు.