డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన సుబ్బరాజు పూరీకి మంచి సన్నిహితుడు. ఇక ఆయన సిట్ అధికారులు వేసిన పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. పూరీ, శ్యాంకెనాయుడులకు భిన్నంగా సుబ్బరాజు వాదన ఉండటం, ఒకానొక దశలో ఏవేవో నోటికొచ్చిన సమాధానాలు చెప్పడం, ఉదయం చెప్పిన సమాధానాలకు, మధ్యాహ్నం చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో దర్యాప్తు బృందం సుబ్బరాజుని బాగానే టార్గెట్ చేసింది.
పూరీ నుంచి కెల్విన్ ఖాతాలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ కావడం, కెల్విన్ ఎవరో తెలియదని చెప్పిన సుబ్బరాజును ఆయన కెల్విన్‌తో తీసుకున్న సెల్ఫీతో పాటు పలు ఆధారాలు చూపడంతో సుబ్బరాజు ఖంగుతిన్నాడట. ఇక నేను మాంసం కూడా తినను, పూర్తి వెజిటేరియన్‌ని అని ఏదో తన నోటికొచ్చిన సమాధానం చెబితే, డ్రగ్స్‌లో వెజ్‌లు, నాన్‌వెజ్‌లు ఉండవని అధికారులు తీవ్రంగా హెచ్చరించారట. ఇక ఆయన ఏదేదో చెప్పడంతోనే ఆయనకు వేసినవి కేవలం 60ప్రశ్నలే అయినా, 13గంటల సమయం విచారణకు పట్టింది. 100ప్రశ్నలు చేసిన పూరీ విచారణ 11గంటలు సాగితే, 60 ప్రశ్నలతో సాగిన శ్యాంకెనాయుడు విచారణ కేవలం 6గంటలల్లోపే పూర్తయింది. కానీ అవే 60 ప్రశ్నలకు గాను సుబ్బరాజు ఏకంగా 13 గంటలు సమయం తీసుకున్నాడు.
మరోవైపు సుబ్బరాజు టాలీవుడ్ కి చెందిన తరతరాలకు కళామతల్లి సేవ చేస్తున్నామని చెప్పుకునే సినీ ఫ్యామిలీలోని ఇద్దరు ఎక్కడ, ఎలా డ్రగ్స్ తీసు కుంటున్నారనే విషయాలను, మరో 15మంది కొత్తపేర్లను చెప్పడం జరిగిందటున్నారు. ఇది నిజమా కాదా? అని ఆలోచిస్తే ఈ డ్రగ్స్ కేసు విషయంలో మీడియా ముందుగా చెబుతూ వస్తున్న ప్రముఖుల పేర్లు, వారి విచారణ తేదీలతో పాటు పలు అంశాలు మీడియాలో వచ్చినవే నిజమయ్యాయి. ఇక హీరో తరుణ్ హాజరై తనకు ఏడేళ్ల కిందట ఓ పబ్‌లో పార్ట్‌నర్‌షిప్ ఉండేదని, కానీ ఆరేళ్ల కిందటే దాని నుంచి బయటకు వచ్చానని చెబుతున్నాడు. కెల్విన్ మాత్రం తరుణ్, నవదీప్‌లకు చెందిన పబ్బుల నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పడం విశేషం.
ఇక డ్రగ్స్ విషయం ఇప్పుడే కాదు..గతంలో కూడా ఎప్పుడు వెలుగులోకి వచ్చినా పూరీ బ్యాచ్, నవదీప్, తరుణ్‌ల పేర్లే బయటకు వస్తున్నాయి. మరి నిప్పులేనిదే ఒక్కసారి పొగ వస్తుంది కానీ ఎల్లకాలం పొగరాదు కదా..! మరోవైపు పబ్‌లపై నిఘా ఉందని తెలిసినా కూడా పూరీ బ్యాచ్‌కి క్లోజ్ అయిన మధుశాలిని ఓ పబ్‌లో తాజాగా భారీ పార్టీ ఇచ్చింది. ఇందులో పలువురు నటీనటులు పాల్గొన్నారు. కానీ పూరి బ్యాచ్ మాత్రం కనిపించకపోవడం గమనార్హం.