సయమం, సందర్భం లేకుండా ఇప్పుడా సెటైర్లు వేసేది వర్మా? అసలు నీకు సామాజిక బాధ్యత ఉందా...? రాంగోపాల్‌వర్మ మేధావే కావచ్చు. ఆయన ఎన్నో చిత్రాలను మాఫియాల మీద, డాన్‌ల మీద తీశాడు. ఆ రకంగా చూస్తే ఉగ్రవాదాన్ని, యూత్‌ని టార్గెట్ చేసే వారికి ఆర్ధిక వనరులు కూడా డ్రగ్స్ వంటి వాటి వల్లే వస్తున్నాయని, ఉగ్రవాదుల ఆర్ధిక పటిష్టతలో డ్రగ్స్‌ది కీలకమైన పాత్ర అని ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఇక వర్మకు పూరీ అత్యంత ఇష్టమైన శిష్యుడే కావచ్చు. ఆయన చిత్రాలు ఫ్లాప్‌అయినా పొగడ్తలతో ముంచెత్తడంతో వర్మ ముందుంటాడు. అసలు వర్మ హైదరాబాద్‌లో ఉంటే ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకునేది పూరీ, జెడి చక్రవర్తి వంటివారే.
ఇక తన ప్రాణ శిష్యున్ని సిట్ అధికారులు, ముఖ్యంగా అకున్ సబర్వాల్ టార్గెట్ చేయడం వర్మకి ఎంతో కోపం తెప్పించిందని ఆయన వ్యాఖ్యలను చూస్తే అర్ధమవుతోంది. అకున్ సబర్వాల్ సినిమాలకు టీజర్, ట్రైలర్ల లాగా ఈ కేసును తన పబ్లిసిటీకి వాడుకుంటున్నాడని, ఆయనను మీడియా ఏదో అమరేంద్ర బాహుబలి టైప్‌లో చూపుతోందని, రాజమౌళి.. అకుల్ సబర్వాల్‌ని పెట్టి 'బాహుబలి-3'ని తీస్తే బాగా ఆడుతుందంటూ అడ్డుఅదుపు లేకుండా, సమయం, వేళాపాళా లేకుండా సెటైర్లు వేయడం చూస్తే ఓ నిజాయితీ కలిగిన అధికారిని ఎంతగా హేళన చేస్తున్నారో అర్ధమవుతోంది.
ఇంకా ఆయన ట్వీట్ చేస్తూ, పూరీని విచారించినట్లుగానే స్కూల్ పిల్లలను కూడా 12 గంటలు విచారిస్తారా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎప్పటినుంచో మరీ ముఖ్యంగా మైనర్, మేజర్ అనే వాదన నిర్భయ కేసు నుంచి నేటి డ్రగ్స్ వరకు జరుగుతూనే ఉంది. మైనర్ అనే పదానికి వేరేగా అర్ధం రాయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక వర్మ వంటి బాధ్యత లేని వ్యక్తులు, కనీస సామాజిక బాధ్యత లేని తండ్రులు, మొగుళ్ల వల్లనే వారి పిల్లలు ఇలా డ్రగ్స్ మహమ్మారిలకు బానిసలవుతున్నారని ఖచ్చితంగాచెప్పవచ్చు.