దర్శకుడు పూరీజగన్నాథ్ పైనే డ్రగ్స్ కేసులు టార్గెట్ అయ్యాయని భావిస్తున్న సమయంలో ఓ అభిమాని చేసిన ప్రసంగానికి సంబందించిన ఓ వీడియోను పూరీ కుమారుడు ఆకాష్ పూరీ షేర్ చేశాడు. ఈ వీడియో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మొహం కనిపించకుండా కేవలం వాయిస్‌ఓవర్ వినిపించిన ఈ వీడియోలో ఆ అభిమాని మాట్లాడుతూ.. మనదేశంలో తప్పులు చేస్తే శిక్షించడానికి చట్టాలున్నాయి. కానీ ఇవి కేవలం బలహీనపరుల మీదనే ప్రతాపం చూపుతున్నాయి. అందరికీ సరిసమానంగా ఈ చట్టాలు వర్తించినప్పుడే మేము చట్టాలకి విలువ ఇస్తాం. కేవలం డ్రగ్స్ వాడేది సిని ప్రముఖులేనా? రాజకీయ నాయకులు, ఇతర బడాబాబులు, ఆడవారిపై అఘాయిత్యాలు చేసే వారి పిల్లలపై ఈ చట్టాలు ఎందుకు పని చేయడం లేదు?
కోట్లు కొల్లగొట్టి విదేశాలకు వెళ్లిపోయిన వారిని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఒక వ్యక్తి.. పైకి వచ్చి తన కాళ్లపై తాను నిలబడటమే కాదు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్న వారిని మనం ఇలా ట్రీట్ చేస్తామా? ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ పతివ్రతలు కాదు. అందరికీ బలహీనతలు ఉంటాయి. ఆయన ఎవరింట్లోనో దొంగతనం చేయలేదే? మీ ఆస్థులు కాజేయలేదే? 80కోట్లు అప్పులో పడి మరలా నిలబడ్డాడు. ఓ వేలుని ఎదుటి వారిపై చూపించే ముందు నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయని తెలుసుకోవాలి. జీవితం యుద్దం, ఓడిపోయినా లేచి పోరాడు అని ఆయన ఎందరికో స్ఫూర్తినిచ్చాడు. ఆయనవల్ల దేశం పాడవుతుందా? ఆయన సినిమాలలో చెప్పేవి పాటిస్తే దేశం ఎప్పుడో బాగుపడిపోయేది.
కెమెరామెన్ గంగతో రాంబాబు, బిజినెస్‌మేన్, టెంపర్ వంటి చిత్రాలలోని నీతిని గమనించి పాటించండి. దేశం ఎంతో ముందుకు వెళ్తుంది. నిక్కరు వేసుకుని పలక చంకలో పెట్టుకుని బడికెళ్లే పిల్లాడికి కూడా దేశంలో పోలీసులు జీతం తీసుకుంటూనే లంచాలు మేస్తున్న విషయం ఎవ్వరికీ తెలియదా..? ఎవరి పర్సనల్స్ వారికుంటాయి. అవినీతి పొలిటీషియన్స్‌ని, ఉద్యోగులను, రౌడీలను, సంఘవిద్రోహశక్తులని వదిలేసే మీ చట్టాలు కేవలం పబ్లిసిటీకి పనికి వచ్చే సినీ వారిపైనే బలం ప్రదర్శిస్తారా? బినామీలను ఏమి చేయగలుగుతున్నారు? అందరినీ సమానంగా చూడాలి. సమానంగా శిక్షించాలని ఆ అభిమాని కోరాడు.ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.