సినిమా రంగంలోని వారిలో ఓ వింత ప్రవర్తన ఉంటుంది. అందరం ఐక్యంగా ఉందాం.. అన్ని సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం... మీ సమస్య కూడా మా సమస్యే కదా..! అని పెద్దతరహాలో ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ చేతలకు వచ్చేసరికి వారి అసలు రంగు అర్దమవుతుంది. విషయానికి వస్తే పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని వేధిస్తున్న సమస్య. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పైరసీ వల్ల పెద్ద బడ్జెట్ చిత్రాలు, స్టార్స్ చిత్రాలకంటే ఎక్కువగా చిన్న సినిమాలే బలవుతున్నాయి. స్టార్‌హీరోల చిత్రాల పైరసీ వచ్చినా, సినిమా బాగుందని టాక్ వస్తే ఆ తర్వాత థియేటర్లకు కూడా వెళ్లి చూస్తారు దీనికి 'అత్తారింటికి దారేది', 'బాహుబలి', 'డిజె' వంటివి ఉదాహరణ. ఆ విధంగా చూసుకుంటే నేటి మద్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీ అంతా కలిసి వేలలో ఖర్చుపెట్టి థియేటర్లలో చూస్తున్న చిత్రాలు పెద్ద చిత్రాలే.
చిన్న సినిమాలు ఎంత బాగున్నా కూడా ఈ చిత్రానికి కూడా అన్ని వేలు దారపోయాలా? పైరసీలో చూద్దాంలే..లేదా శాటిలైట్‌లో చూద్దామని అనుకుంటారే గానీ థియేటర్లకు వెళ్లరు. ఇక 'డిజె'తో పాటు పలు చిత్రాల పైరసీలు ఆన్‌లైన్‌లో వచ్చినప్పుడు ఆయా చిత్రాల హీరోలు, నిర్మాతలు, దర్శకులు, వారి అభిమానులు నానా హంగామా చేస్తారు. తాము చేసేదే సినిమా అన్నట్లుగా పైరసీ గురించి రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి ఊదరగొట్టి, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి తమకున్న పలుకుబడితో దానిని అడ్డుకోవాలని చూస్తారు. ఇందులో తప్పులేదు.
కానీ మిగిలిన వారి చిత్రాలు పైరసీ అవుతుంటే మాత్రం దానిని పరిష్కరించడానికి, గొంతు గొంతు కలిపి మద్దత్తు తెలపడానికి వీరికి చేతలు, మాటలు రావు. వాటన్నింటినీ మరలా తమ మరో చిత్రం విడుదలయ్యే దాకా దాచుకుంటారు. 'అర్జున్' సమయంలో అయితే మహేష్ పైరసీ సీడీలు అమ్ముతున్నారని తానే స్వయంగా ఓ షాపుపై దాడి చేశాడు. ఇక 'డిజె' విషయంలో జరిగిన రచ్చ తెలిసిందే. తమ చిత్రాల టీజర్లు లీక్ అయితేనే గగ్గొలు పెట్టేవారు ఇప్పుడు 'శమంతకమణి' విషయంలో ఆన్‌లైన్‌లో మొబైల్ ద్వారా సినిమా లైవ్‌లో పైరసీ కావడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించలేకపోతున్నారు.
ఎందుకంటే అది మన డబ్బుకాదు.. మన సినిమా కాదు.. అందునా అది చిన్నచిత్రం.. ఇలా ఉంటాయి మన పెద్దల నీతులు.. అన్యాయం ఎవరికైనా అన్యాయమే. డబ్బు ఎవరిదైనా డబ్బే. సమస్య ఎవరిదైనా ఇండస్ట్రీ మొత్తానిది అని మన పెద్దలు మర్చిపోతున్నారు. మరలా మరో పెద్ద సినిమా, స్టార్ సినిమా విడుదలైనప్పుడు మాత్రమే మన వారికి పైరసీ గుర్తురావడం ఖాయం. కావాలంటే వెయిట్ అండ్ సీ...!