పూరీది ఒక డిఫరెంట్ స్కూల్. ఆయన తాజాగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటంతో తనకు ఎంతో మిత్రులైన జర్నలిస్ట్‌లు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని మీడియాని టార్గెట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. కానీ ఇది అసమంజసం. ఆయన 'పోకిరి' చిత్రంలో పోలీస్ అధికారి అయిన షాయాజీ షిండే క్యారెక్టర్‌తో మీడియాపై విరుచుకుపడ్డాడు. 'నేనింతే'లో ఫిల్మ్‌జర్నలిజం, సోషల్ మీడియా, రివ్యూలు, రేటింగ్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆయనకు ఆ స్వేచ్చ ఉంది.
తాననుకున్నది తీయవచ్చు. అంతేగానీ జర్నలిస్ట్‌ల ఔనత్యాన్ని చూపించడం కోసం 'ఇజం' తీశాను... మీడియాలోని వారందరూ నాకు మిత్రులే, నా గురించి ఇలా ప్రచారం చేయడం దారుణమంటున్నాడు ఎవరికైనా వృత్తి ధర్మం ముఖ్యం.పూరీ 'పోకిరి'తో పాటు 'గోలీమార్' వంటి చిత్రాలలో పోలీసులను కూడా బాగా హైలైట్ చేసి చూపించాడు. అంత మాత్రాన పోలీసులు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు వస్తే, మనల్ని గొప్పగా చూపించే సినిమా చేశాడని మౌనంగా ఉండాలా? వారి డ్యూటీ వారు చేశారు. మీడియా పనిగట్టుకుని పూరీనీ టార్గెట్ చేయలేదు. పోలీసులు, డ్రగ్స్ సంబంధిత అధికారులు కేసు బుక్ చేస్తే దానినే మీడియా తన వంతు బాధ్యతగా రిపోర్ట్ చేసింది.
కేసు పెట్టింది మీడియానా? లేక పోలీసులా? అనేది పూరీకి తెలియదా..? ఆయన పేరు బయటికి వచ్చిన తర్వాతే మీడియా ఆయన విషయాన్ని హైలైట్ చేసింది. ఆయన్నే కాదు.. పెద్దగా పాపులారిటీ లేని నందు, తనీష్‌లను ప్రశ్నించి, రియాక్ట్ అయినట్లే పూరీపై కూడా స్పందించింది. కానీ దానిని ఏదో మీడియా పనిగట్టుకుని చేసినట్లు పూరీ భావించడం బాధాకరం, ఎంత స్నేహితులైనా, బంధువులైనా ఎవరి డ్యూటీ వారు చేయాలి.. కదా..! పూరీ...!