బాలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, కంగనా రనౌత్ హీరోయిన్ గా ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రను ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ గా తెరకెక్కిస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మి భాయ్ చిన్నతనంలో మణికర్ణికగా ఎలా వుండేదనే అంశాలను సినిమాలో చూపించబోతున్నాడు క్రిష్. అతి పెద్ద ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తై సినిమా సెట్స్ మీదకెళ్ళిపోయింది. ఝాన్సీ లక్ష్మి భాయ్ అంటే వీర వనిత. ఆమె యుద్ధంలో గుర్రమెక్కి కత్తి తిప్పుతుంటే శత్రువులకు గుండెల్లో దడ పుట్టేది. మరి మణికర్ణికలో కంగనా కూడా కత్తి గట్రా తిప్పాలి కాబట్టి ప్రస్తుతం యుద్ధ విన్యాసాల్లో శిక్షణ తీసుకుంటుంది.
తాజాగా కంగనా రనౌత్ మణికర్ణిక షూటింగ్ లో గాయపడి ఆసుపత్రి పాలైనట్లు చెబుతున్నారు. మణికర్ణిక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన కంగనా కత్తి ఫైట్ చేస్తున్న సమయంలో ఆమె నుదుటికి గాయమైనట్టు చెబుతున్నారు. గాయపడిన కంగనాను వెంటనే చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా.... డాక్టర్లు ఆమెకి 15 కుట్లు వేసినట్టు తెలుస్తోంది. కుట్లు వేయించుకున్న కంగనా ఐసీయూలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోందని చెబుతున్నారు.
అయితే కంగనాకు ఈ గాయం ఎలా తగిలింది అంటే... కంగనా, నిహార్ పాండ్యల మధ్య వార్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో జరిగిందని చెబుతున్నారు. నిహార్ పాండ్య చేతిలో వున్న కత్తి పొరపాటున కంగనా నుదుటికి తగిలి... వెంటనే రక్తం కారిపోవడంతో ఆమెను హాస్పిటల్ కి తరలించారని.... నుదుటికి కుట్లు వేసిన డాక్టర్స్ ఆమెకు సీరియస్ ఏమి లేదని... కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది.