మనవారు ఒకటి చేసి హిట్టయితే అందరూ అదేరూట్‌ను ఫాలో అవుతుంటారు. ఒకప్పుడు 'ప్రేమించుకుందాం...రా, కలిసుందాం...రా..బావగారూ...బాగున్నారా..! ఇలా ట్రెండ్ నడిచింది. ఆ తర్వాత ఒక్క హీరో చేసిన పోలీస్ సినిమా హిట్టయిదంటే అందరూ అదే రూట్‌లో వెళ్తుంటారు.ఒక పేరడీ చిత్రం సక్సెస్ అయితే చాలు అందరూ స్పూఫ్‌ల మీద పడతారు. ఇక ఒకరు ముకుందా అంటే మరోకరు గోపాలా..గోపాలా, మరొకరు 'గోవిందుడు అందరివాడేలే' అంటారు.
కాగా ఇటీవల చూసుకుంటే మన హీరోల మనసు పంచెకట్టుతో చూపించే పవర్ మీద ఆధారపడుతున్నారు. పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు', నాగ చైత్య 'ప్రేమమ్', అల్లు అర్జున్ మలయాళీ అభిమానుల కోసమని 'డిజె' (దువ్వాడ జగన్నాథం)లో పంచె కట్టు. ఇక ఇప్పుడు రానా కూడా అదే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న పవర్‌ఫుల్ పొలిటికల్ స్టోరీ 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మాతగా, కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ఆగష్టు11న విడుదల కానుంది.
ఇక రానా పంచెకట్టు, దానిని పైకి కట్టే విధానం చూస్తుంటే 'చినరాయుడు'తో పాటు వెంకటేష్ పంచెకట్టిన ఎన్నో చిత్రాలలోని స్టైల్‌లోనే ఇదీ ఉంది. మొత్తానికి అదే జీన్స్ కాబట్టి ఇబ్బందేంలేదు.ఇక ఈ చిత్రం కూడా ఆడిందంటే ఆపై మరికొందరు హీరోలు కూడా కాస్టూమ్స్ ఖర్చు నిర్మాతలకు తగ్గిస్తూ పంచెలతోనే కనపడినా ఆశ్చర్యం లేదంటున్నారు.