ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమ వంతు సాయం చేసినా పెద్దగా వాటికి ప్రచారం ఇచ్చేవారు కాదు. పబ్లిసిటీకి దూరంగా గుప్తదానాలు చేసేవారు. నాడు మీడియా కూడా ఇంత విస్తృతంగా లేదు. దాంతో అవి సామాన్య అభిమానులకు, సామాన్య ప్రజలకు తెలిసేవి కావు. కానీ రోజులు మారాయి. సాంకేతిక పెరిగింది. దీంతో పాటు హీరోలకు వీరాభిమానులు కూడా ఎక్కువవుతున్నారు.
దాంతో తాము సాయం చేయడమే గాక సామాన్యులను, అభిమానులను కూడా ఉత్తేజపరిచి, వారికి మార్గదర్శకంగా ఉండాలని మన హీరోల మనసులు మారాయి. కాబట్టి తాము సాయం చేయడమే కాదు.. పలువురిలో స్ఫూర్తిని నింపుతున్నారు. తాజాగా అస్సోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎందరో చనిపోయారు. మరెందరో నిలువ నీడ లేకుండా కకావికలైపోయారు. తిండి, మంచి నీరు కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని చూసిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వెంటనే స్పందించాడు.
నీళ్లలో మునిగిన ఇళ్లను చూపిస్తున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అస్సాం వాసులు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాల్సిన బాధ్యత ఎంతో ఉందని, ఇచ్చే ప్రతి రూపాయి విరాళం ఎంతో ముఖ్యమని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ ఈ పోస్ట్ పెట్టిన 15 నిమిషాలకే ఆయన భార్య ఉపాసన కొణిదెల ఆ నీళ్లలో మునిగి ఉన్న నీళ్లను చూపే ఫొటోను, స్క్రీన్‌షాట్ తీసి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది.
మా వంతుగా మేము కొంత సాయం చేశాం..మీకు తోచిన విధంగా మీరూ సాయం చేయండి. మన మందరం కలిసి ఎంతో సాయం చేయగలం.. అని స్ఫూర్తిని నింపే కామెంట్‌ను చేసింది. కాగా గతంలో హుథ్‌హుథ్ తుపాన్ సమయంలో కూడా మొదట స్పందించింది చెర్రీనే. ఇక ఈ జంట ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.