అందరికీ సెంటిమెంట్లు ఉంటాయి. అన్నిరంగాలలోనూ సెంటిమెంట్స్‌కి కొదువలేదు. కానీ ఇది సినిమా ఇండస్ట్రీలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాల ప్రారంభం, టైటిల్ ప్రకటన, టైటిల్ పెట్టడంలో అక్షరాల సెంటిమెంట్, పేర్లలో మార్పు, ఇంగ్లీషులో న్యూమరాలజీ ప్రకారం స్పెల్లింగ్ మార్పులు, స్క్రీన్‌నేమ్‌లు ఇలా పలు విషయాలలో మన వారు సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతుంటారు.
కాకపోతే కె.విశ్వనాథ్, బాలకృష్ణ తదితరులు ఈ విషయంలో బయటపడుతారు. మరికొందరు అదేం లేదు అంటూనే ఫాలో అవుతుంటారు. ఇక వెండితెరపై గతంలో పలువురు బాస్‌లుగా కనిపించారు. నాగార్జున 'బాస్'గా వస్తే, విజయశాంతి 'లేడీ బాస్'గా వచ్చింది. బాలకృష్ణ 'భలే వాడివి బాసూ' అని వస్తే, చిరంజీవి 'బిగ్‌బాస్' అంటూ అవతారం ఎత్తాడు. ఇవ్వన్నీ ఫ్లాప్‌లుగానే మిగిలిపోయాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో బుల్లితెరపై తాజాగా ప్రారంభమైన 'బిగ్‌బాస్'కు ఇదే సెంటిమెంట్ పనిచేస్తుందా? అని కొందరు వ్యంగ్యంగా, కొందరు భయపడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ వెండితెర అయినా బుల్లితెర అయినా రఫ్పాడిస్తానని 'బిగ్‌బాస్' షో తో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన పార్టిసిపెంట్స్‌ని పరిచయం చేసిన తీరు, వారితో మనసు విప్పి హృదయాలను తాకేలా మాట్లాడిన మాటలు, బిగ్‌బాస్ హౌస్‌ని పరిచయం చేసిన విధానం అన్ని బాగున్నాయి. ఇక ఇందులో ఎంటరైన పార్టిసిపెంట్స్ కూడా ఆసక్తిని రేపే విధంగానే ఉన్నారు.
నటి వేద అలియాస్ అర్చన, నటుడు సమీర్, ఐటం గర్ల్ ముమైత్‌ఖాన్, నటుడు ప్రిన్స్, జానపద గాయని మధుప్రియ, హీరో సంపూర్ణేష్‌బాబు, వ్యాంపు నటి జ్యోతి, గాయని కల్పనా రాఘవేందర్, సినీ విశ్లేషకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేష్, కత్తి కార్తీక, నటుడు శివబాలాజీ, నటి హరితేజ, అప్‌కమింగ్ విలన్ ఆదర్శ్ బాలకృష్ణ, కమెడియన్ ధన్‌రాజ్‌లు వచ్చారు.
ముందుగా వార్తలు వచ్చినట్లుగా మంచు లక్ష్మి, స్నేహ, సదా, పోసాని వంటి వారు రానప్పటికీ మొదటి సీజన్ సక్సెస్ అయితే వారే పరుగెత్తుకుని వస్తారని నిర్వాహకులు భరోసాగా ఉన్నారు. మొత్తానికి స్టార్‌మా ఎన్టీఆర్‌పై పెట్టుకున్న నమ్మకానికి మొదటిరోజే ఆయన నిలబెట్టాడని చెప్పవచ్చు.