మన టాలీవుడ్ మేకర్స్ చాలా మంది సినిమా తీసేప్పుడే సినిమా లెక్కల్ని ఓ రేంజ్ లో ఊహించేసుకుంటారు. ఓవర్‌సీస్ అనే మార్కెట్ అనుకోకుండా ఓ వరంలా మారింది వీరికి. సినిమా బడ్జెట్‌లో దాదాపు 25శాతం వరకు ఓవర్‌సీస్ రైట్స్ ద్వారానే పొందాలని చూస్తున్నారు. 'బాహుబలి2' చిత్రం ఏకంగా 20 మిలియన్లను వసూలు చేయడంతో ఇక తెలుగు చిత్రాల ఓవర్‌సీస్ మార్కెట్ బాగా పెరిగిందని భావిస్తూ రైట్స్‌ని పెద్ద పెద్ద మొత్తాలకు అమ్ముతున్నారు. బయ్యర్లు కూడా అలాగే కొంటున్నారు.
కానీ సినిమా ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాలలో కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి. ఓవర్‌సీస్ పరిస్థితి అది కాదు. భారీ ధరకు కొన్న బయ్యర్లు థియేటర్లలో టిక్కెట్ల రేట్లను భారీగా పెంచేస్తుండటంతో ఎంత అభిమాని అయినా ఎలా ఉన్నా తానొక్కడే చూస్తున్నాడు కానీ కుటుంబ సమేతంగా చూడటంలేదు. మంచి టాక్ వస్తేనే ఫ్యామిలీతో థియేటర్‌కి వెళ్తున్నాడు. 'బాహుబలి2'ని పక్కనపెడితే మహేష్ 'బ్రహ్మోత్సవం', పవన్‌కళ్యాణ్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు', బన్నీ'డిజె'లు కూడా ఓవర్‌సీస్ బయ్యర్లకు నష్టాన్నే మిగిల్చాయి.
అదే సందర్బంలో 'నేను లోకల్, క్షణం, పెళ్లి చూపులు, శతమానం భవతి' తాజాగా 'నిన్నుకోరి' వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు బాగా లాభాలు తెచ్చాయి. పెద్ద హీరో అని, భారీ బడ్జెట్ అని భారీ రేట్లకు కొన్నా కూడా హిట్ వచ్చినా కూడా..ఆయా చిత్రాలకు లాభాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అదే ఫ్లాప్ టాక్ వస్తే భారీ నష్టాలొస్తున్నాయి. దీంతో చిన్న సినిమాలే బెటర్ అంటున్నారు. అందుకేనేమో ఇప్పుడు మహేష్ 'స్పైడర్', పవన్-త్రివిక్రమ్‌ల చిత్రాలకు భారీ రేట్లు చెబుతుండటంతో బయ్యర్లు ముందుకు రావడం లేదని టాక్.