మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించరనే ఓ అభిప్రాయం టాలీవుడ్‌లో బలంగా ఉంది. ఇదినిజమే.. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌లతో పోల్చుకుంటే మంచి చిత్రాలకు, వైవిధ్యభరితమైన కథలకు మన ప్రేక్షకులు కాస్త దూరమే. దీనికి కారణం మాత్రం స్టార్ కల్చర్. స్టార్స్ చిత్రాలను, భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే థియేటర్లకు వచ్చి చూసే ప్రేక్షకులు మంచి సినిమాలను మాత్రం చానెల్స్‌లో వేసినప్పుడు చూడవచ్చులే.. పైరసీ సీడీ వస్తుందిలే అంటూ ఉంటారు.
ఒకప్పుడు 'శంకరాభరణం, సాగరసంగమం' వంటి చిత్రాలు కూడా కనకవర్షం కురిపించాయి. నేడు కూడా మచ్చుకు కొన్ని ఉన్నా కూడా మంచి చిత్రాలు మాత్రం కమర్షియల్‌గా పెద్దగా హిట్టవ్వడం లేదు. మరి కోట్లలో జరిగే వ్యాపారంలో మనం ఓ 'లగాన్, దంగల్' వంటి చిత్రాలను ఎందుకు తీయడం లేదు అనేకంటే మనం అలాంటి చిత్రాలను ఎందుకు ఆదరించిడం లేదనేది అసలు ప్రశ్న.
మంచి చిత్రాలను తీసే మురారి, ఏడిద నాగేశ్వరరావు, గుణ్ణం గంగరాజు, నీలకంఠ, చంద్రసిద్దార్ద్ వంటి వారు కనుమరుగవుతున్నారు. తెలుగులో జాతీయ అవార్డులు పొందిన పలు చిత్రాలే దీనికి ఉదాహరణ. మంచి చిత్రం తీస్తున్నామంటే నిర్మాత, దర్శకులు కూడా నష్టం వస్తుందని ముందుగానే మెంటల్‌గా ఫిక్స్ కావాల్సిన పరిస్థితి. ఇక ఇటీవల మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో చేసిన 'మనమంతా' చిత్రం దీనికి పెద్ద ఉదాహరణ. పరమరొటీన్ అయిన 'మన్యంపులి' లాంటి చిత్రం స్థాయిలో కూడా ఈ చిత్రం కలెక్షన్లను సాధించలేదు.
దీనిపై సాయి కొర్రపాటి మాట్లాడుతూ, మరీ మంచి సినిమాలు రావడం ప్రేక్షకులకు పెద్దగా ఇష్టం లేదోమో? 'మనమంతా' చిత్రం చూసిన వారందరూ ఏ వంక పెట్టకుండా సూపర్ అన్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ధియేటర్లకు వచ్చి ఆ సినిమా చూడలేదు. ఇక తాజాగా విడుదలైన 'రెండు రెళ్లు ఆరు' కూడా మంచి చిత్రం అవుతుందని అనుకున్నామని, కానీ దానిలో సరైన స్టార్‌కాస్ట్ లేదని కొందరు అన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మన ఆడియన్స్ మైండ్‌సెట్ కేవలం కమర్షియల్, మాస్, స్టార్ చిత్రాల చుట్టూ తిరిగితే కనీసం ఆ మాత్రం ప్రయత్నించే దర్శకనిర్మాతలు, హీరోలు కూడా దొరకరనేది వాస్తవం.