మాటేరాని చిన్నదాని.. అనే భామలు కూడా సినిమా ఫీల్డ్‌కి వస్తే చిలుకపలుకులు పలుకుతూనే అందరికీ బిస్కెట్ల్ వేస్తుంటారు. ఇక మన డైరెక్టర్ల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చిరంజీవితో సినిమా చేస్తుంటే చిరంజీవితో చేయడమే నాలక్ష్యం. చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తేనే పెరిగాను అంటారు. బాలయ్యతో, లేకా ఏ బడా హీరోతో చాన్స్ వచ్చినా అవే వాక్యాలు చెబుతారు. యాజ్ ఇట్ ఈజ్‌గా అవే చెబుతూ, హీరో పేరు వద్ద మాత్రం బ్లాంక్‌గా( ఖాళీ) ఉంచుతారు. ఏ హీరోతో సినిమా వస్తే ఆ ఖాళీలో ఆ హీరో పేరు రాస్తారు.. అంతే... మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్పా... అంటారు.
మరి మన దర్శకుల నుంచి నేర్చుకుందో లేదా స్వతహాగానే అంతేనేమో గానీ తాజాగా ఓ హీరోయిన్ ఇదే పనిలో ఉంది. ఆమె నివేదా థామస్. ఈమె నానితో 'జెంటిల్‌మేన్'లో, తాజాగా 'నిన్నుకోరి' లో నటించిన సందర్బంగా నాని అంటే నాకెంతో ఇష్టం, ఆయన సినిమాలన్నింటినీ నేను తప్పకుండా మిస్ కాకుండా చూస్తూ ఉంటాను అని చెప్పింది. నిజంగా 'ఈగ' ముందు నుంచే నానికి 'ఆష్టాచెమ్మ' వంటి హిట్ ఉన్నా కూడా ఆయనను రెగ్యులర్‌గా నిన్నమొన్నటి దాకా ఫాలో అయిన తెలుగువారే తక్కువ. మరి నివేదా ఎప్పటి నుంచి నానికి అభిమానో తెలియదు.
ఇక తాజాగా ఆమె ఎన్టీఆర్ నటిస్తోన్న 'జై లవకుశ'లో నటిస్తోంది. సో... ఎన్టీఆర్ నా ఆల్‌టైం ఫేవరేట్ ఆర్టిస్ట్. ఆయన చిత్రాలన్నీ చూశాను. ఆయనో గొప్పనటుడు అంటూ కితాబిచ్చేసింది. ఇక ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాత్రం ఇప్పుడే చెప్పదట. సస్పెన్స్ అంటోంది. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆమె సునీల్ స్థాయికో లేదా సప్తగిరి స్థాయికో పడిపోతే వారితో నటించేటప్పుడు కూడా సేమ్ డైలాగ్ చెబుతుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఇక మన హీరోలు కూడా ఏవేవో పొగుడుతూ, భజన చేసేవారి మాటలే వింటూ పొంగిపోతారే గానీ వాస్తవాలు వారికి రుచించవు. వారినిదూరంగానే ఉంచుతారు. కాబట్టి సినీ రంగంలోకి వచ్చే వారు ముందుగా భజనలు నేర్చుకోవాలి. లేదంటే వాస్తవవాది లోక విరోధి అని చెప్పిన పెద్దల మాటే నిజమవుతుంది.