ఎవరు సెంటిమెంట్లను నమ్మినా, నమ్మకపోయినా కొన్ని విషయాలలో వాటిని తప్పకుండా అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రస్తుతం పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడట. ఇక ఇందులో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
'జల్సా, అత్తారింటికి దారేది'ల తర్వాత హ్యట్రిక్ మూవీగా దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇక 'అత్తారింటికి దారేది'లో సీనియర్ నటి నదియా చేత కీలకమైన పాత్ర చేయించిన త్రివిక్రమ్ ఈ చిత్రంలో ఖుష్బూ, ఇంద్రజలను నటింపజేస్తున్నాడు. అలాగే 'అత్తారింటికి దారేది'లో తాతయ్యగా నటించిన బొమ్మన్ ఇరానీని ఈ తాజా చిత్రంలో కూడా తీసుకున్నారు.
మరోవైపు 'అత్తారింటికి దారేది'లో కీలకమైన 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా' పాట ఎంతగా పాపులర్ అయిందో తెలుసు. పవన్ చేత ఆ పాటను పాడించిన త్రివిక్రమ్ తాజా చిత్రంలో కూడా పవన్ చేత ఓ పాట పాడిస్తున్నాడు. మొత్తనికి ఎంత కాదన్నా 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఈ చిత్రంలో కూడా సెంటిమెంట్స్‌ను త్రివిక్రమ్ పాటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.