ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం-1985' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన మణిరత్నంతో పాటు పలువురితో చిత్రాలు చేయనున్నాడని, ఇక అన్నీ డిఫరెంట్ రోల్సే చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక రామ్ చరణ్ కు కొరటాల శివతో ఓ కమిట్‌మెంట్ ఉందని వచ్చినా అది లేటవుతుందని చాలా మంది భావించారు.
ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారు? అనే దానిపై కూడా పలు వార్తలు షికారు చేశాయి. ఇక రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీనెంబర్150'ని తాను కొత్తగా స్థాపించిన కొణిదెల బేనర్‌లో చేసిన విషయం తెలిసిందే. ఇక చిరు 151వ చిత్రంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో భారీ బయోపిక్ మూవీ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని కూడా కొణిదెల బేనర్‌లోనే నిర్మించనున్నాడు.
అయితే తన తండ్రితో పాటు ఇతర హీరోలు నటించే చిత్రాలను, చిన్నబడ్జెట్ చిత్రాలను నిర్మిస్తాడని భావిస్తూ వచ్చిన చెర్రీ అనుకోకుండా షాక్ ఇచ్చాడు. ఇప్పటికే చిరంజీవి ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రంతో పాటు 151వ చిత్రాన్ని కూడా ఆయన తన కుమారుడు చరణ్ నిర్మాతగానే చేస్తుండటంతో గీతా ఆర్ట్స్‌లో ఈ రెండు చిత్రాలను చేయలేదని, మరీ ముఖ్యంగా చిరంజీవి రీలాంచింగ్ ఫిల్మ్‌గా భారీ ఆదాయాలు వచ్చే 150వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై చేయలేదని అల్లు అరవింద్ బాధతో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక చిరు బోయపాటితో 152వ చిత్రం అల్లు అరవింద్‌కి చేస్తానన్నాడు.దాంతో కొరటాల శివ-రామ్ చరణ్‌ల చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ రామ్ చరణ్ మాత్రం కనీసం అల్లు అరవింద్‌తో భాగస్వామ్యంగా కూడా చేయకుండా, గతంలో 'క్షణం, ఘాజీ' వంటి చిత్రాలను పివిపి బేనర్‌లో తనదైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తీసిన అభిరుచి ఉన్న నిర్మాత నిరంజన్ రెడ్డిని భాగస్వామిగా కలుపుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎవరెన్ని చెప్పినా, ఇటు బన్నీ వ్యవహారంతో మెగా హీరోలకు, అల్లుకి మధ్య ఒకప్పటి సంబంధాలు ఇప్పుడు లేవనే అంటున్నారు. అందునా నిర్మాతగా లాభాలను చవిచూసిన రామ్ చరణ్ ఇక నుంచి తాను నిర్మించే చిత్రాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతాడని తెలుస్తోంది.