నానికి నేచురల్ స్టార్ అని పిలిచినప్పుడు పలువురు దీనిని విమర్శించారు. రెండు మూడు హిట్లను గాలివాటంగా కొట్టిన ఎందరో ఉన్నారని, తర్వాత వారి కెరీర్‌లు ఏమయ్యాయో చూడాలని ఎగతాళి చేశారు. కానీ నాని వాటికి మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాధానం చెబుతున్నాడు. 'పైసా, జెండాపై కపిరాజు' వంటి ఫ్లాప్‌ల తర్వాత ఆయన పనైపోయిందని, మరీ ఓవర్‌కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడని, కథ చెప్పందే సినిమాలు ఒప్పుకోవడం లేదని, అనేక మార్పులు చేర్పులు చేస్తూ, తనకు దర్శకత్వంలో ప్రవేశం కాస్త ఉండటంతో విర్రవీగుతున్నాడని విమర్శలు గుప్పించారు. కానీ ఆయన గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమా కథలను, హీరోయిన్ల నుండి దర్శకుల, నిర్మాతల ఎంపిక వరకు ఆయన చూపుతున్న శ్రద్దను చూస్తే ముచ్చటేస్తోంది.
వరుసగా ట్రిపుల్ హ్యాట్రిక్‌కి 'నిన్నుకోరి'తో నాంది పలికాడు. తనది గాలివాటం విజయం కాదని, ఆచితూచి చేస్తూనే ఏడాదికి మూడు నాలుగు చిత్రాలకు తక్కువ కాకుండా చేస్తున్నానని నిరూపించాడు. ఇక దర్శకనిర్మాతల ఎంపిక, స్టార్ హీరోయిన్ల వెనుక పడకుండా తనతో నటించిన హీరోయిన్లనే స్టార్స్‌గా మార్చి వేస్తున్నాడు. ఒక్క హిట్‌కే అల్లాడుతున్నవారికి వరుస విజయాలతో షాక్ ఇస్తున్నాడు.
ఇప్పుడు ఆయన కెరీర్ టాప్‌గేర్‌లో ఉంది. రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లున్నాడు. ఆయనను అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది. వారందరూ నాని మా అభిమాన హీరో అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవుతున్నారు. తనది గాలివాటు విజయం కాదని ప్రూవ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దిల్‌రాజు-వేణుశ్రీరాంలతో 'ఎంసీఏ', కృష్ణగాడి వీరప్రేమగాధ దర్శకుడు, తాజాగా 'లై' చేస్తున్న హను రాఘవపూడితో పాటు ఎందరో ఆయన కోసం క్యూలో నిలబడుతున్నారు. హిట్ వచ్చింది కదా..! అని పారితోషికం పెంచి, పెద్ద దర్శకులు, స్టార్ హీరోయిన్లు, స్టార్ సాంకేతిక నిపుణులు, భారీ బడ్జెట్‌ల జోలికి పోకుండా, పారితోషికం పెంచకుండానే ఎక్కువ చిత్రాలు చేస్తూ మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించాడు.
ఆయన కంటూ ఓ స్టైల్, మార్కెట్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దగా ఆడని 'ఎవడే సుబ్రహ్మణ్యం, మజ్ను' చిత్రాలు కూడా ఎంతో కొంత లాభాలను ఆర్జించాయంటే మాటలు కాదు. ఇక తాజాగా ఆయన కొత్త దర్శకుడు శివనిర్వాణపై నమ్మకంతో చేసిన 'నిన్నుకోరి' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆయనకు ఓవర్‌సీస్‌లో పెద్ద స్టార్స్ రేంజ్ మార్కెట్ ఉండటమే దానికి నిదర్శనం. నిజానికి నాని కిందటి చిత్రం 'నేను..లోకల్' ఏకంగా 35 కోట్ల క్లబ్‌లో చేరింది.
దాంతో ఆయన రెమ్యూనరేషన్ పెంచడంగానీ మరీ విపరీతమైన లాభాలకు, భారీ రేట్లకు బయ్యర్లకు అమ్మకుండా 25కోట్లలోనే బిజినెస్ చేశాడట. దాంతో ఆయనతో పాటు నిర్మాత, దర్శకుడు, బయ్యర్లు కూడా భారీ లాభాలు చవిచూస్తున్నారు. ఈ చిత్రం ఈ వీకెండ్‌లో 25కోట్లు వసూలు చేసింది. పలువురు సోమవారం నుంచి డల్ అవుతుందని భావించారు. కానీ సోమారం కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సోమవారంతో 30కోట్లకు దగ్గరైందట. ఈ చిత్రానికి నాని గత చిత్రాల కంటే భారీ ఓపెనింగ్స్ వస్తుండటమే దీనికి ఉదాహరణ.