కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్‌కి దిల్‌రాజు, సురేష్‌బాబు.. ఇలా ఎవ్వరూ హిట్ ఇవ్వలేకపోయారు. ఆయన చివరి విజయం ఇంకా 'పూలరంగడు' మాత్రమే. కాగా ప్రస్తుతం ఆయన సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్‌తో 'ఉంగరాల రాంబాబు' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రమైనా ఆయన కెరీర్‌ను గాడిలోపెడుతుందని పలువురు భావించారు.
టైటిల్ కూడా క్యాచీగా ఉండటంతో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. మరోవైపు కమల్‌హాసన్ పరిశ్రమకు పరిచయం చేసిన గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కమల్‌హాసన్ 'విశ్వరూపం'తో పాటు ఆయన ఇప్పటికే 'రన్ రాజా రన్, జిల్' చిత్రాలకు సంగీతం అందించాడు. 'ఉంగరాల రాంబాబు'కి ఆయనే సంగీత దర్శకుడు.
ఈ చిత్రంలోని పాటలన్నింటికీ ఆయన మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం యూనిట్ రెండు పాటలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. మరోపక్క ఈ చిత్రం షూటింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తై దాదాపు రెండు నెలలు కావస్తున్నా, ఆయన రీరికార్డింగ్ చేయకుండా నిర్మాత, దర్శకులను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తుండేసరికి ఆయన చుట్టూ తిరిగి, తిరిగి విసుగొచ్చి రీరికార్డింగ్ కోసం మరో వ్యక్తిని పెట్టుకున్నారట.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న గిబ్రాన్ ఇలా చేస్తే ఆయనకు భవిష్యత్తు ఉండదని, కాబట్టి ఆయన టైంసెన్స్ మెయిన్‌టెయిన్ చేయాలని పెద్దలు సలహాలిస్తున్నారు.