దర్శకుడు కృష్ణవంశీకి క్రియేటివ్ దర్శకునిగా పేరుంది. 'గులాబి'లో జెడి చక్రవర్తి నుంచి 'సింధూరం'లో బ్రహ్మాజీ, రవితేజ వరకు, అంత:పురం, ఖడ్గంలోని పవర్‌ఫుల్ పాత్రల వరకు ఆయన క్యాస్టింగ్‌లో ఎక్కడా రాజీ పడడు. కానీ ఆయన ఫేడవుట్ అయిపోయాడు. అన్ని సినిమాలు దెబ్బేశాయి. ఇక ఆయన తీసిన 'నక్షత్రం' చూస్తే మాత్రం ఇదంతా రికమండేషన్ బ్యాచా అనే అనుమానం వస్తోంది. ఆయన సామాన్యంగా టాలెంట్ లేనిదే ఛాన్స్ ఇవ్వడు. ఇక సందీప్‌కిషన్‌కి ఎలాగూ చోటా మామయ్య ఉన్నాడు. రెజీనా నుంచి ప్రగ్యాజైస్వాల్ వరకు అందరినీ కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్లు ఉంది.
ఇక ఇందులో పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఓ కుర్రాడు తన సర్టిఫికేట్లు కోల్పోయి పోలీస్ ఉద్యోగం రాకపోయినా పోలీస్‌లా ఉండే స్టోరీ అని వార్తలు వస్తున్నాయి. ఇక సాయిధరమ్‌తేజ్ కూడా పోలీసుగా 'ఖడ్గం'లోని శ్రీకాంత్ తరహాలో పవర్‌ఫుల్ పాత్రను చేయనున్నాడట. మరోవైపు తన ఆస్థాన నటుడైన ప్రకాష్‌రాజ్‌ది కూడా కీలకమైన పోలీస్‌పాత్రగా తెలుస్తోంది. కానీ నెగటివ్ పాత్రను తనీష్ చేత చేయించడం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. తనీష్ ఇప్పటివరకు నటునిగా మెప్పించింది లేదు. తాను ఒకసారి కృష్ణవంశీతో మీ సినిమాలో చిన్నపాత్రైనా ఇవ్వమని కోరాడట. దాంతో కృష్ణవంశీ పిలిచి మరీ తనకు అవకాశం ఇచ్చాడట.
కానీ నాడు తన వ్యక్తిగత వ్యవహారాలతో పాటు తన తండ్రి మరణించడంతో వంశీని కలవలేదని, కానీ నా కోసం ఆగి మరలా తననే పిలిచి నెగటివ్ పాత్రను ఇచ్చాడని తనీష్ చెబుతున్నాడు. అంతేకాదు.. ఆయన ఏకంగా తనీష్‌ని 'నేను నిన్ను నమ్ముతున్నాను.. నీవు నన్ను నమ్మవా?' అనడంతో ఆ పాత్రను ఓకే చేశానని తన భజన తాను చేశాడు. సామాన్యంగా ఎవ్వరినీ పట్టించుకోని కృష్ణవంశీ పిలిచి మరీ సందీప్‌కిషన్‌కి హీరోగా, తనీష్‌కి నెగటివ్ పాత్రల్లో పవర్‌ఫుల్ రోల్స్ ఇవ్వడం చూసి ఇదంతా రికమండేషన్ బ్యాచ్ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.