పాతకాలంలో దర్శకుడు కావాలంటే ఎవరో ఒకరి దగ్గర ఏళ్లకు ఏళ్లు శిష్యరికం చేయాలి. అయినా కూడా అవకాశాలు వస్తాయనే గ్యారంటీ లేదు. అవకాశం వచ్చినా ఒక్క చిత్రం ఫెయిలయితే ఫేడవుటే. కానీ నేడు అలా కాదు.. వర్మ శిష్యరికంతో అసలు సినిమాలపై ప్రాక్టికల్ అనుభవం కాస్త ఉంటే చాలు అవకాశాలు వస్తున్నాయి. ఇక షార్ట్‌ఫిలింస్ ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుని కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో నవతరం ముందుకు వస్తోంది. కానీ మనస్టార్స్ మాత్రం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు. సామాన్యంగా కొత్త దర్శకులు, రచయితలు వస్తే వారిని పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. మొదట ఎవరో ఒకరితో చేసిరా .. తర్వాత చూద్దాం అనే వారే ఎక్కువ.
ఇక పవన్ వంటి వారిని కలవాలంటే సాధ్యమయ్యే పనే కాదు. ఆయన్ను చాలాకాలం కిందట ఎవరైనా కొత్తవారు మీకు కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యే కథతో ఉదాహరణకు 'తొలిప్రేమ' కరుణాకరన్, లేదా 'ఖుషీ' ఎస్.జె.సూర్యలా వస్తే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆయన దానికి సమాధానంగా కసి ఉంటే మార్గం అదే దొరుకుతుంది. ముందుగా నాతో చేయాలనే కాంక్ష ఉంటే ఎలాగైనా నా దగ్గరకు వస్తారని చెప్పాడే గానీ అసలు విషయం దాటేశాడు.
ఇక నాగార్జున ఒకప్పుడు తన కెరీర్ మొదటి రోజుల్లో తెలుగులో సరైన దర్శకులే లేరని చెప్పి, ప్రతాప్‌పోతన్ డైరెక్షన్‌లో 'చైతన్య', రవిచంద్రన్‌తో 'శాంతి క్రాంతి', ఫాజిల్‌తో 'కిల్లర్', మహేష్‌భట్, ప్రియదర్శన్ వంటి వారికి సినిమాలు చేశాడు. 'రక్షకుడు'తో పాటు ఏ చిత్రం, ఏ దర్శకుడు కూడా ఆయనకు బ్లాక్‌బస్టర్ ఇవ్వలేదు. దాంతో మరలా వర్మ, ఉప్పలపాటి నారాయణరావు.. ఇలా పనిచేశాడు. ఇక న్యూ టాలెంట్‌ని వెతికి లారెన్స్, కళ్యాన్‌కృష్ణ, కృష్ణవంశీ, విజయ్‌భాస్కర్, దశరథ్ వంటి వారితో చేసి బాగానే సక్సెస్ సాధించాడు. తాజాగా ఓంకార్‌తో 'రాజుగారి గది2' చేస్తున్నాడు.
ఇటీవల ఓ సన్నిహితునితో నాగ్ మంచి కథలు తెచ్చే దర్శకులు, రచయితలు లేరని అన్నాడట. కానీ అంతకు ముందే ఆయన ట్విట్టర్‌లో కొత్తవారిలో చాలా టాలెంట్ ఉందని మెచ్చుకున్నాడు. నేడు సుజీత్, చందు మొండేటి, విక్రమ్ కె కుమార్, తరుణ్‌భాస్కర్, మేర్లపాక గాంధీతో పాటు పలువురు టాలెంట్ దర్శకుల కథలను కూడా స్టార్స్ వినడానికి ఆసక్తి చూపడం లేదు. అసలు కథే వినకుండా కథలు లేవు..టాలెంటెడ్ దర్శకులు లేరని మన సీనియర్ స్టార్స్ వంక పెట్టడం సరికాదు!