రాంగోపాల్ వర్మ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన ఫేడవుట్ అయినప్పటికీ ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తాననడంతో నేడు ఆయన మరలా వార్తల్లో నిలిచాడు. ఆయన తీసిన 'సర్కార్3' ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. కానీ ఆయన వాస్తవిక చిత్రాలను, ఎలాంటి వ్యక్తి జీవితాన్నేనా తనదైన శైలిలో వివాదాస్పదం చేయడంలో దిట్ట.
పరిటాల రవి, సూరి, వంగవీటి వంటి వారిని తప్పుగా చూపించాడని వార్తలు వస్తున్నాయి. కానీ అవి సహజం, ఒకరి జీవితాన్ని కాస్త తప్పుగా చూపిస్తే, అదే నిజమైనా కూడా మన వీరాభిమానులు తట్టుకోలేరు. ఆయన అన్నట్లు పరిటాల రవి, సూరి, వంగవీటిలను కూడా దేవుడిగా చూపించాలా? అన్నదానికి ఎవ్వరి వద్దా సమాధానం లేదు ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో పలు వివాదాస్పద అంశాలను చూపించాల్సి వస్తుంది.
ఎన్టీఆర్ నటునిగా, ముఖ్యమంత్రిగా వెలిగిన తీరు. నాదేండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు, నేషనల్ ఫ్రెంట్‌లో కీలకమై వి.పి. సింగ్‌ని ప్రధాని చేయడంలో ఆయన పోషించిన పాత్రలతో పాటు చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి టీడీపిని లక్ష్మీపార్వతి హస్తగతం కాకుండా తన చేతిలోకి తెచ్చుకున్న వైనం, వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఘటన, లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ను ఆయన అవసరాన్ని కనిపెట్టి ఆయన చెంత చేరిందా? లేదా? నాడు ఎన్టీఆర్‌కి చెందిన భారీ సంపాదన ఏమైంది? బాలయ్య, హరికృష్ణ, దగ్గుబాటిలో పాటు నందమూరి వారు చంద్రబాబును సపోర్ట్ చేయడం వంటివి చూపించాలి.
ఇక ఆయన చివరి రోజుల్లో జెమిని చానెల్‌కి ధర్మపీఠంలో ఇచ్చిన ఇంటర్వ్యూ, అల్లుడు నన్ను వెన్నుపోటు పోడిచాడనే వ్యాఖ్యలు, జామాత దశమ గ్రహ అన్న వ్యాఖ్య వంటివి అనేకం ఉన్నాయి. ఇంతకీ బాలయ్య చెప్పిన ఎన్టీఆర్ బయోపిక్, వర్మ తీసే బయోపిక్ ఒక్కటేనా? ఇద్దరు విడివిడిగా తీస్తున్నారా? అదే జరిగితే వాస్తవాలను చూపించడం కష్టమవుతుందన్న సంగతి వర్మకు తెలియదా?.
బాలయ్య తన తండ్రి బయోపిక్‌ని ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలో కూడా తెలుసని తెలిపాడు. వివాదాల జోలికి పోకుండా ఆయన నటునిగా ఎదిగిన క్రమం, ముఖ్యమంత్రి అయిన వైనాన్ని మాత్రమే చూపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మరి బాలయ్య చిత్రాన్నే వర్మ తీస్తుంటే అది వన్‌సైడ్‌గా ఉండటం ఖాయం. కానీ వర్మ తనసొంతగా తీస్తే మాత్రం మునుపెన్నడూ లేని దుమారం చెలరేగడం ఖాయం.
ఇక కొత్త సెన్సార్ నిబంధనల ప్రకారం బయోపిక్ తీస్తే వారి కుటుంబ సభ్యుల నుంచి ఎన్‌ఓసీ తేవాలనే నిబందన వచ్చిన తరుణంలో అసలు ఇది సాధ్యమేనా?కేవలం వర్మది పబ్లిసిటీ స్టంటా? అనేది వేచిచూడాల్సివుంది....!