జిఎస్టి కి వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా కోలీవుడ్ పరిశ్రమలో ఎంతో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రెండు ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు భారం భరించడం తమ వల్ల కాదంటూ సినిమా షూటింగ్ లు కూడా ఆపేశారు. ఇక గత సోమవారం నుండి తమిళనాట థియేటర్స్ అన్ని బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. 48, 58 శాతం పన్నుల భారానికి వ్యతిరేఖంగా తమిళ సినీ నటులు పోరాటం షురూ చేశారు. అందులో కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయగా.. కొందరు మాత్రం డైరెక్ట్ గానే స్పందించడం మొదలు పెట్టారు.
అయితే రాజకీయాల్లోకి వస్తా అంటూ తాత్సారం చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఏం మాట్లాడకపోయే సరికి తమిళ సినిమా పరిశ్రమలోని కొందరు ప్రముఖులు జిఎస్టి కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని వ్యక్తి రాజకీయాలకు పనికి రాడంటూ రజినీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక రజినీకాంత్ అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లాడని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియా అంటూ ఒకటి ఏడ్చిందిగా అందులో అయినా కనీసం తన స్పందనని రజినీ వ్యక్త పరిస్తే బావుండేదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత నాలుగు రోజులుగా సైలెంట్ గా ఉన్న రజినీ ఎట్టకేలకు జిఎస్టి మీద తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. తమిళ పరిశ్రమలో ఉన్న లక్షలాది మంది జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం తమ డిమాండ్ ను ఆమోదించాలి అంటూ తమిళ సినీ పరిశ్రమకు తన మద్దతుని తెలియజేశాడు రజినీ.