ఇంతకు ముందు దక్షిణాది చిత్రాలు, మరీ ముఖ్యంగా రజనీకాంత్ నటించిన 'రోబో' వంటి చిత్రాలు ఉత్తరాదిన విడుదలై సంచలనం సృష్టించినా అది పెద్దగా లెక్కలోకి రాలేదు. వాటికి బాలీవుడ్‌కి పరిచయమున్న శంకర్ దర్శకుడు కావడం, బాలీవుడ్‌లో కూడా నెంబర్‌వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏ.ఆర్.రెహ్మాన్ పనిచేయడం, రజనీ గతంలో పలు హిందీ స్ట్రెయిట్ చిత్రాలలో నటించి ఉండటం, ఐశ్వర్యారాయ్ వంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లు వాటిలో నటించడం వల్ల అవి పెద్ద సంచలనం కాలేదు.
కానీ 'బాహుబలి' వేరు. ప్రభాస్, అనుష్క వంటి వారి ముక్కు మొహం కూడా బాలీవుడ్‌కి తెలియదు. రానా, తమన్నా కాస్త పరిచయం. సంగీతం అందించిన కీరవాణికి అక్కడ ఎం.ఎం.క్రీమ్‌గా పరిచయం ఉన్నప్పటికీ ఆయనేమీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఇక 'ఈగ' చిత్రం గురించి తెలిసినవారు 'ఈగ, మగధీర' గురించి ఎక్కువగా వార్తల్లో విన్నవారే గానీ వాటిని అదే పనిగా వెళ్లి చూసినవారు తక్కువే. కానీ 'బాహుబలి' తర్వాత రాజమౌళి, ప్రభాస్‌ల పాత చరిత్రను బాలీవుడ్ వారు తిరగదోడుతున్నారు. ఇక 'మగధీర' అయితే హిందీలోకి రీమేక్ అవుతుందని వార్తలు చదివారు గానీ అది జరగలేదు. తాజాగా 'రాబ్తా' చిత్రం 'మగధీర'కు కాపీ అనే ప్రచారం జరిగింది.
మొత్తానికి ఏది.. దేనికి కారణమైనా కూడా నేడు ప్రభాస్ నటించిన పాత ఫ్లాప్ చిత్రాలైన రెబల్, ఏక్‌నిరంజన్‌లకు కూడా డిమాండ్‌పెరిగింది. పరమ రొటీన్ అయిన అల్లుఅర్జున్ 'సరైనోడు' యూట్యూబ్‌ని షేక్ చేసింది. ఇప్పుడు 'జంజీర్' హీరోగా గుర్తున్న రామ్‌చరణ్ - రాజమౌళిల 'మగధీర' హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 10కోట్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. మొత్తానికి ఇదంతా బాహుబలి పుణ్యమేనని చెప్పాలి.