ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ప్రభాస్ పేరు మారుమోగుతోంది. ప్రస్తుతం ఆయన యువి క్రియేషన్స్ బేనర్‌లో సుజీత్ దర్శకత్వంలో 'సాహో'చిత్రం చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన హిందీలో కరణ్‌జోహార్‌కి ఒక సినిమా చేస్తాడని, కాదు.. కాదు.. సాజిద్ నడియావాలాకు చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మరో చిత్రం ప్రభాస్-రాజమౌళిలు కలిసి చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.
కాగా గతంలో ప్రభాస్, ఎమ్మెస్‌రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో 'పౌర్ణమి' చిత్రం చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇక ఆ తర్వాత ప్రభుదేవా పూర్తిగా దర్శకత్వం వైపే దృష్టి పెట్టి పలు దక్షిణాది చిత్రాలను హిందీలో రీమేక్ చేసి పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. కానీ గత కొంతకాలంగా ఆయనకు బాలీవుడ్‌లో కూడా దర్శకునిగా సరైన హిట్ లేదు. దాంతో ఆయన మరలా కోలీవుడ్‌కి వచ్చి విశాల్, కార్తిల కాంబినేషన్‌లో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ, తనకు ప్రభాస్ చాలా కాలంగా పరిచయమని, ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి అతనితో తనకు స్నేహం ఉందని తెలిపాడు. ఆయనతో 'పౌర్ణమి' సరిగా ఆడలేదని దాంతో తాను మరలా ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో భావిస్తున్నట్లు తెలియజేశాడు. 'బాహుబలి' వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదు. ఆయనకు ఎప్పుడో ఓ కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. చేద్దాం.. అన్నాడు. దాంతో 'సాహో' తర్వాత ఆయనతో ఓ చిత్రం చేస్తానని చెప్పాడు.
కొందరు మాత్రం ఇది నిజమేనని చెబుతుండగా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆఫర్స్ ప్రభాస్‌కి వస్తున్నాయని, దాంతో ఆయన ఇప్పుడు ప్రభుదేవాతో చేసే అవకాశం లేదంటున్నారు. ఇక సుజీత్ తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఓ స్టైలిష్ చిత్రం చేస్తాడని ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఏదిఏమైనా ఎంత క్లోజ్ అయినా కూడా ప్రభాస్ విషయంలో ప్రభుదేవా అబద్దం చెప్పే అవకాశం లేదని, నిజంగా ప్రభాస్.. ప్రభుదేవాతో చిత్రం చేస్తే గనుక ఆయనకు అది ఆటోమేటిగ్గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా క్రేజ్ రావడం గ్యారంటీ అని మాత్రం చెప్పవచ్చు.