నేచురల్ స్టార్ నాని చిత్రాలు కాస్త విభిన్నంగా ఉండటమే కాదు.. ఇంటిల్లిపాదిని విశేషంగా అలరిస్తాయి. అందుకే ఆయన కూడా ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడగలిగే క్లీన్ చిత్రాలనే చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో కేవలం 'నేను లోకల్'కి మాత్రమే యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఆయన కొత్త దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో నివేదాధామస్ హీరోయిన్‌గా చేస్తున్న 'నిన్నుకోరి' చిత్రానికి కూడాసెన్సార్ సింగిల్ కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఇక ఈ చిత్రం త్రికోణ ప్రేమకధా చిత్రంగా రూపొందింది. కోనవెంకట్ రచనగా, దానయ్యతో కలిసి కోనవెంకట్ నిర్వహణలో రూపొందిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కానుంది. కాగా మొదట్లో ఈ చిత్రం సింగిల్‌గా సోలో మూవీగా విడుదలవుతుందని భావించినప్పటికీ హిందీ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న శ్రీదేవి 'మామ్', విజయ్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్ భైరవ'లతో పాటు చిన్న చిత్రమైనప్పటికీ అభిరుచి కలిగిన చిత్రాలను నిర్మిస్తాడని పేరుపొందిన సాయికొర్రపాటి నిర్మాణంలో రూపొందుతున్న లోబడ్జెట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రెండు రెళ్లు ఆరు' కూడా విడుదల అవుతుంది.
గతంలో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌లతో ఇదే టైటిల్ తో వచ్చిన చిత్రం మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ చిత్రం కూడా కామెడీని పండిస్తే మంచి పబ్లిసిటీ చేసుకుని, సినిమాని నిలుపుకోగలిగిన సత్తా ఉన్న సాయి కొర్రపాటికి ఈ చిత్రం బాగానే వర్కౌట్ అవుతుంది. ఇక ఈ చిత్రాలన్నీ నాని 'నిన్ను కోరి'కి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ చూపేంత సీన్‌లేదని అంటున్నారు.