గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్ మధ్య, చెప్పను బ్రదర్ కామెంట్‌తో ఐకమత్యంగా కనిపించిన మెగాఫ్యాన్స్‌లో భిన్నాభిప్రాయాలు చోటుచేసుకోవడం అక్షరసత్యం. ఎందరు కాదు అని వాదించినా, అది మా యాంటీఫ్యాన్స్ పని అని బల్లగుద్ది చెప్పినా కూడా ఇది వాస్తవమే.
గతంలో ఏ ఫంక్షన్‌లోనైనా ఎన్టీఆర్ తన తాత గురించి, బాబాయ్ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవాడు. ఒకానొక వేడుకలో అతిధులుగా విచ్చేసిన రాజమౌళి, వినాయక్‌ల చేత మా బాబాయ్‌తో సినిమా తీస్తేనే మాట్లాడుతాను అని కూడా ఎంతో ఆప్యాయత చూపాడు. కానీ పోను పోను అది మారిపోయింది. మరి తాను ఎంతగా బాబాయ్ గురించి చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదనో, మరే ఇతర కారణాల వల్లో హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఈమధ్య మౌనంగా ఉంటున్నారు.
'గౌతమీపుత్ర శాతకర్ణి' సమయంలో బాలయ్యను ఆకాశానికి ఎత్తేస్తూ అబ్బాయ్‌లు ట్వీట్స్ పెట్టినా సరైన రెస్పాన్స్‌లేదు. అంతేగాక 'నాన్నకుప్రేమతో', 'డిక్టేటర్' పోటీ సమయంలో ఎన్టీఆర్‌కి థియేటర్లు దొరకకుండా చేశాడని, ఇక 'జనతాగ్యారేజ్'టైంలో ఫ్లాప్ అనే టాక్ తేవడానికి కొందరు ప్రత్యేకంగా ప్రయత్నించారని కూడా చెప్పుకుంటూ ఉంటారు.
ఇక తాజాగా అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన కూడా తన చిత్రాలలో మెగాస్టార్, పవర్‌స్టార్ అంటూ ప్రతి చిత్రంలో ఏదో ఒక సందర్భంలో చెప్పేవాడు. అది ఇప్పుడు తగ్గింది. తాజాగా 'మా తాతయ్య' అంటూ అల్లు వారి ఫ్యామిలీని ఉద్దేశించి డైలాగ్ పేల్చాడు. దీంతో ఇటు ఎన్టీఆర్, అటు బన్నీలు తమ నందమూరి, మెగా బ్రాండ్ల నుంచి బయటపడి తమకంటూ సొంత ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.