రజినీకాంత్ ఈ మధ్య కాలంలో తరుచూ అమెరికాకు వెళ్లి వస్తున్నాడు. ఆయన అమెరికా వెళ్ళేది కూడా తన ఆరోగ్యం కోసమే అని అందరికి తెలిసిన విషయమే. రజిని గత చిత్రం 'కబాలి' షూటింగ్ కంప్లీట్ కాగానే కొన్ని నెలల పాటు అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్న రజినీకాంత్ ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చాడు. అప్పటినుండి ఇప్పటివరకు బాగానే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఉత్సాహంగానే వున్నాడు. మధ్యలో 2.0 షూటింగ్ ఫినిష్ చేశాడు. అలాగే ఈ మధ్యనే రంజిత్ పా డైరెక్షన్ లో 'కాలా' షూటింగ్ మొదలు పెట్టి రెండు భారీ షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసేశాడు.
అలాగే ఈ మధ్యన అభిమానులతో భేటీ అంటూ హడావిడి చేస్తున్నాడు కూడా. అయితే ఇంత ఫాస్ట్ గా రజినీ తయారవడానికి గల కారణం ఆయన రాజకీయ రంగ ప్రవేశమే అని చెబుతున్నారు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై రోజుకో వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిగో రాజకీయాల్లోకి వస్తున్నాడు అదిగో రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఒకటే హడావిడి. కానీ రజిని మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వచ్చే దీపావళి కి రజిని రాజకీయ రంగ ప్రవేశం, ఆయన కొత్త పార్టీ వివరాలు బయటికి వస్తాయని ఆయనగారి సన్నిహితులు చెబుతున్నారు.
కానీ ఇప్పుడు మళ్ళీ సడన్ గా రజినీకాంత్ అమెరికా పయనమైనట్టు సమాచారం అందుతోంది. మళ్ళీ ఆయన అమెరికాకు ఆరోగ్య రీత్యానే వెళ్లినట్టు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట సింగపూర్‌లో ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుండి ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆ విషయమై రజిని తరుచు అమెరికా వెళుతున్నారట. ఇక ఇప్పుడు కూడా ముంబై నుండి నేరుగా అమెరికాకు వెళ్లినట్టు చెబుతున్నారు. మరి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న రజిని ఇలా రాజకీయాల్లోకి వస్తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని రజిని ఫ్యామిలీ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే రజనీకాంత్‌ని రాజకీయాల్లోకి వద్దని రజిని ఫ్యామిలీ అభ్యర్థిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కొత్తగా కథనాలు వెలువడుతున్నాయి.