మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం ఫుల్ గా హార్డ్ వర్క్ చేసి మరీ సెట్స్ మీదకెళ్ళాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో సావిత్రి పాత్రకుగాను కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన నాగ్ అశ్విన్, సమంతని మరో కీ రోల్ కోసం తీసుకున్నాడు. సావిత్రి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంది. అలాగే నటన జీవితంలో కూడా సావిత్రి ఎంతోమంది స్టార్స్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది. మరి సావిత్రి జీవితం తెర మీద చూపించాలి అంటే ఆమెతో సంబంధం వున్న వాళ్ళని కూడా తెర మీద చూపించాల్సి వస్తుంది. అయితే ఇక్కడే ఈ పాత్రల దగ్గరే ఇప్పుడు సస్పెన్సు కొనసాగుతుంది.
సావిత్రి నట జీవితంలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ముఖ్య పాత్ర పోషించారు. మరి ఇప్పుడు మహానటిలో ఎన్టీఆర్ పాత్రని, ఏఎన్నార్ పాత్రలని ఎవరు చెయ్యనున్నారో అనేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్ పాత్రని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బావుండు అని అనుకున్నారు చాలామంది. అందుకు అనుగుణంగానే ఎన్టీఆర్ ని ఈ పాత్రకి ఒప్పించారనే టాక్ కూడా వినబడింది. ఎన్టీఆర్ ని ఒప్పించేందుకు అశ్వినీదత్ స్వయంగా రంగంలో దిగినట్లు కూడా చెప్పారు. కానీ తాత కేరెక్టర్ లో తాను చెయ్యడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదని అంటున్నారు. ఆ మహానుభావుడి కేరెక్టర్ చేసేంత గొప్పవాడిని కాను.... అంత స్థాయి నాకు లేదని సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించాడట తారక్.
ఇకపోతే సావిత్రి భర్త జెమిని గణేశన్ కేరెక్టర్ ని దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. అయితే సినిమా ఇప్పుడే మొదలైంది కాబట్టి..... సీనియర్ ఎన్టీఆర్ కేరెక్టర్ కూడా గెస్ట్ రోల్ కాబట్టి ఈ లోపు ఎన్టీఆర్ ని ఎలాగైనా ఒప్పించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా చెబుతున్నారు. ఇక ఫైనల్ గా ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే ఆ కేరెక్టర్ కి ఎవరిని తీసుకోవాలో అనేదాని మీద కూడా ఆలోచన జరుపుతున్నట్లు చెబుతున్నారు.