సుమంత్ అశ్విన్... ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు గారి అబ్బాయి. ఎందరికో బ్లాక్‌బస్టర్స్‌ని ఇచ్చిన ఈయన ప్రస్తుతం నిర్మాతగా, దర్శకునిగా యాక్టివ్‌గా లేడు. ముఖ్యంగా తన కొడుకు హీరోగా నిలబెట్టే సమయానికి ఆయన చేతులెత్తేశాడు. మంచి లవర్‌బోయ్‌లా కనిపించే ఈ సుమంత్ అశ్విన్ దాదాపు అరడజను చిత్రాలు చేసినా ఎవ్వరినీ, ఏ వర్గాన్ని అలరించలేకపోయాడు. పెద్దవంశీ చేతిలో పడినా ఈయన జాతకం మారలేదు. కాగా ఈయన ఆమధ్య ఓ వెబ్‌సీరీస్ అంటూ చేయికాల్చుకున్నాడు.
ఇక నేడు వెబ్‌సిరీస్‌లకి కూడా మంచి క్రేజ్ ఉండటంతో మరో సుమంత్ అశ్విన్‌ని మించిన లవర్‌బోయ్ తన టాలెంట్‌ను, స్కిల్స్‌ని వెబ్‌సీరీస్‌లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. అతను ఎవరో కాదు 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేష్. మొదటి సినిమా సూపర్‌హిట్, వెంటనే వచ్చిన దిల్‌రాజు కొత్తబంగారు లోకం కూడా మంచి హిట్టు. దాంతో ఈ లవర్‌బోయ్ తానేం చేసినా ప్రేక్షకులు మరీ ముఖ్యంగా యూత్ చూస్తారని ఫిక్స్ అయిపోయాడు.
దాంతో ఎడా పెడా వచ్చిన ప్రతి చిత్రానికి తాననుకున్న రెమ్యూనరేషన్ ఇస్తే చాలు అనుకొని వరసగా దాదాపు డజన్‌కి పైగా చిత్రాలు చేశాడు. ఒక్కహిట్ కాదు..కదా.. తన క్యారెక్టర్‌నే తన నటనతో మెప్పించలేకపోయాడు. తనతోటి తెరంగేట్రం చేసిన జూనియర్స్ అయిన నిఖిల్ వంటి వారు తమదైన నటనతో, వైవిధ్యభరితమైన చిత్రాలతో దూసుకెళ్తుంటే కళ్లప్పగించి చూస్తూ కూర్చున్నాడు, ఆ తర్వాత ఓ సింగింగ్ ఆల్బమ్ అంటూ చేశాడు. సోదిలోకి కూడా రాలేదు. ఇప్పుడు వెబ్‌సిరీస్ చేసి నా టాలెంట్ చూపిస్తాను.. కాస్త చూడమంటున్నాడు. మరి ఆయన విజ్ఞప్తిని ఎందరు ఆలకిస్తారో వేచిచూడాల్సివుంది..!