తాజాగా సౌతిండియన్ సూపర్ స్టార్ తన పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాడని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో తమిళనాడుకు చెందిన బిజెపి ఎంపీ, వివాదాస్పద నేత సుబ్రహ్మణ్యస్వామి రజినీ రాజకీయాలలోకి రాకూడదని, వస్తే అతనికి సంబంధించిన పలు ఆర్ధిక నేరాలు, నిజ జీవిత రహస్యాలను బయటపెడతానని, అవి బయటకు వస్తే ఇంతకాలం రజినీ ఎంతో మంచోడని నమ్మిన ప్రజులు, మీడియానే కాదు రజినీ వీరాభిమానులు కూడా ఆయన్ను చీదరించుకుంటారని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
కాగా తమిళనాడుకు చెందిన స్థానిక బిజెపి నాయకులు, హిందూ మత సంస్థలు రజినీ రాజకీయాలలోకి రావాలని ఆహ్వానిస్తున్నాయి. రజినీ బిజెపిలో చేరకపోయినా హిందూ సానుభూతి పరునిగానే ఉంటాడని, తమిళ రాజకీయాల దృష్ట్యా ఆయన ప్రాంతీయ పార్టీని పెట్టినా కూడా బిజెపి మద్దతు దారుగా, ఎన్డీయే భాగస్వామిగా ఉంటాడని అంటున్నారు. దాంతో హిందు మక్కల్‌కట్చితో అధ్యక్షునితో పాటు పలువురు హిందూ వాదులు, రజినీ అభిమానులు స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
స్వామికి తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అయినా స్వామి తగ్గడం లేదు సరికదా స్వరం పెంచాడు. ఇక ఆయన్ను రాజకీయాలలోకి రమ్మని గానీ, తమ పార్టీలో చేరమని గానీ మోదీగాని, అమిత్ షాగానీ కోరరని, వారితో తాను ఆ విషయంపై మాట్లాడి స్పష్టతకు వచ్చినట్లు స్వామి అంటున్నాడు.ఇక రజినీ అభిమానులు ఆగ్రహంతో ఉన్నప్పటికీ తన రాజకీయం గురించిగానీ తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా మౌనంగా ఉండాలని తమ హీరో రజిని అదేశించడంతో తాము మౌనంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.