ఇటీవల వరకు మెగాస్టార్ తర్వాత ఆస్థానం బన్నీదే అని కామెంట్లు వినిపించాయి. తాజాగా 'డిజె' విడుదల తర్వాత మరలా సోషల్ మీడియాలో, బయట ఇవే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ పలువురు రామ్ చరణ్ నటించిన 'దృవ'తో తాజాగా విడుదలైన బన్నీ'డిజె' కలెక్షన్లకు ముడిపెడుతున్నారు. 'ధృవ' ఫుల్‌రన్‌లో సాధించిన కలెక్షన్లను 'డిజె' మొదటి వారంలోనే అధిగమిస్తోందని, ఆ విధంగా చూసుకుంటే కాబోయే మెగాస్టార్ రామ్ చరణ్ కాదు.. బన్నీనే అని కొందరు అంటున్నారు.
అయితే వరుసగా బన్నీ చేసిన చిత్రాలైన 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు', తాజాగా విడుదలైన 'డిజె' అన్ని వేటికవే విభిన్నమైనప్పటికీ ఇవేమీ నేల విడిచి సాము చేసిన చిత్రాలు కావు. అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్‌కి, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మంచి మాస్ సాంగ్స్, కావాల్సినంత మాస్ మాసాలా అంశాలు దట్టించుకున్నవే. చివరకు 'సన్నాఫ్ సత్యమూర్తి'ని కూడా తాను ఏమీ ప్రయోగం చేయలేదని, సినిమాకు వెరైటీ ట్రీట్‌మెంట్ ఇచ్చానే గానీ దానిని కూడా తాను బన్నీని దృష్టిలో ఉంచుకుని అన్నిరసాలను కలిపే వడ్డించానని స్వయాన త్రివిక్రమ్ శ్రీనివాసే పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.
కానీ 'ధృవ' విషయానికి వస్తే ఇది తమిళ రీమేక్. ఈ సినిమాను చరన్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత అందరూ సిడీలలో, నెట్‌లో ఈ చిత్రాన్ని చూసేశారు. ఇక ఒరిజినల్ వెర్షన్‌కి, ధృవకి విపరీతమైన పోలికలు వచ్చాయి. చరణ్ పాత్రను అంతే ధీటైన అరవింద్‌స్వామి నటనతో పోల్చారు. అక్కడక్కడ ఒకటిరెండు సీన్స్, ఒకటి అరా ఫైట్స్, ఒక పాట తప్పితే అందులో సామాన్యులకి అర్ధమయ్యే, నచ్చే అంశాలేమీ లేని కత్తిమీద సాము వంటి స్క్రీన్‌ప్లేతో నడిచే మల్టీప్లెక్స్, ఓవర్‌సీస్, వైవిధ్య చిత్రాలను చూడాలని ఆశపడే చిత్రం 'దృవ'.
దానిని సామాన్య మాస్‌ప్రేక్షకుడే కాదు.. చివరకి మెగాభిమానులు కూడా ఈ ప్రయోగాన్ని జీర్ణించుకోలేకపోయారన్నది వాస్తవం. ఇక అది నోట్ల రద్దు సమయంలో వచ్చిన సినిమా. మొత్తానికి తనకంటూ ఓన్ ప్యాన్స్‌ని తయారు చేసుకోవడంలో బన్నీ చరణ్ కంటే ముందున్నా కూడా రాబోయే 'రంగస్థలం 1985'ని కూడా దేనితోనూ పోల్చకూడదు.