జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో 'జై లవకుశ' చేస్తున్నాడు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేయనుండటంతో పాటు అందులోని ఓ పాత్ర పూర్తిగా నెగటివ్ రోల్ అని తెలుస్తోంది. ఆ విధంగా చూసుకుంటే ఎన్టీఆర్ పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు లెక్క. ఇక ఈ టెన్షన్‌తో పాటు జూనియర్‌కి మరో టెన్షన్ కూడా పట్టుకుంది. ఆయన భారీ పారితోషికంతో పాటు తన కండీషన్స్ ప్రకారం సెట్స్, సాంకేతికనిపుణులను ఎంచుకుని తమన్ చేత మ్యూజిక్‌ని చేయించుకుని థీమ్‌సాంగ్ కూడా చేయించుకున్నాడు.
ఇక హిందీలో హిట్టయిన ఈ షో తెలుగులో ఏమాత్రం వర్కౌట్ అవుతుందనే దానిపై పలు అనుమానాలున్నాయి. ఎన్టీఆర్‌కి మంచి వాయిస్, సమయ స్ఫూర్తి, కలుపుకుదోలుతనం ఉన్నా ఉత్తరాది వారికి దక్షిణాది వారికి ఎన్నో విషయాలలో బేధాలున్నాయి. తినే తిండి నుంచి శరీరాకృతి వరకు చాలా తేడాలున్నాయి. ఉత్తరాది వారు మాట్లాడినంత బోల్డ్‌గా దక్షిణాది వారు మాట్లాడలేరు. మన జబర్దస్త్, పటాస్‌లపైనే బూతు అని అంటున్నాం, మరి కాఫీ విత్ కరణ్‌లో ఆయన అడిగే ప్రశ్నలు, వాటికి ఆయా సెలబ్రిటీలు ఇచ్చే సమాధానాలను మనం కనీసం ఊహించను కూడా లేం.
ఇక ఉత్తరాది వారు దక్షిణాదిలో ఎందుకు రాణిస్తున్నారు? మన తెలుగమ్మాయిలు తెలుగులో ఎందుకు రాణించలేకపోతున్నారు అంటే వారు దారాళంగా చేసే గ్లామర్‌షోని మన అమ్మాయిలు, సంప్రదాయం నిండిన వారు చేయలేరు. ఎవరైనా ఉత్తరాది వారు చేస్తే చూస్తారు.. కానీ ఆ విషయం పది మందిలో చెప్పుకోవడానికే సిగ్గుపడాతారు. ఇక హిందీ అనేది ఉర్దూ, అరబ్బీ వంటి వాటిని పోలివుంటుంది.దీంతో పాకిస్థాన్, సౌదీ వంటి దేశాలలో కూడా హిందీకి విస్తృత మార్కెట్ ఉంది.
కానీ దక్షిణాది పరిస్థితి అలాంటిది కాదు.ఇక తాజాగా తమళంలో విజయ్ టీవీలో కమల్‌హాసన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్' మొదలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జల్లికట్టులో పాల్గొన అమ్మాయిని తెచ్చి సెలబ్రిటీని చేయడం, ఫేడవుట్ అయిన నమిత తప్ప చెప్పుకోదగ్గ సెలబ్రిటీలు రాకపోవడంతో దీనిపై ఫ్లాప్‌టాక్ వస్తోంది. దీంతో మరి స్టార్ మా, ఎన్టీఆర్‌లకు టెన్షన్ మొదలైందంటున్నారు.