బతికి ఉన్నపుడు ఎందరికో జీవితాన్నిచ్చాడు. ఎందరి సమస్యలనో పరిష్కరించాడు. తీరా చనిపోయాక ఆయన సహాయం పొందినవారే ముఖం చాటేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు విషయంలో ఇదే జరిగింది. సినిమా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే అని మరోసారి స్పష్టమైంది. జగమేమాయ అనే సినిమాలో నటించాక, నటుడు మురళీమోహన్‌ను పలకరించే వారే లేరు. వేషాలు రావని తెలిసి విజయవాడ వెళ్లి వ్యాపారం చేసుకోసాగాడు. ఆ టైమ్‌లో దాసరి నుండి పిలుపు వచ్చింది. మళ్లి చెన్నై చేరాడు. దాసరి తన సినిమాల ద్వారా మురళీమోహన్ కెరీర్ ఎదుగుదలకి తోడ్పాడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. దాసరి తుదిశ్వాస విడిచినపుడు మురళీమోహన్ అమెరికాలో ఉన్నారు. చివరి చూపుకురాలేదు. అందరు అర్థం చేసుకున్నారు. తీరా హైదరాబాద్ తిరిగివచ్చాక అయినా దాసరి కుటుంబాన్ని పరామర్శించడం కనీస మర్యాద. అది కూడా ఆయన మరిచారని అంటున్నారు. హైదరాబాద్‌లో వివిధ సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ దాసరి ఇంటిని కానీ, ఆయన సమాధిని కానీ సందర్శించని మురళీమోహన్ తీరుపట్ల సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కడసారి చూపుకు రానప్పటికీ, హైదరాబాద్ రాగానే దాసరి సంతాపసభలో పాల్గొని నివాళులు అర్పించారు. నిజానికి దాసరికి, చిరంజీవికి మధ్య అనుబంధం తక్కువే. అయినప్పటికీ సినీ పెద్ద మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. మరి దాసరి సహాయంతో ఎదిగిన ఆర్టిస్టులు మాత్రం ముఖం చాటేయడం చిత్రంగా అనిపిస్తోంది.