వైసీపీ అధినేత వైయస్ జగన్‌కి న్యూజిలాండ్ నుంచి వినోదయాత్ర చేసుకుని వచ్చిన వెంటనే కాకుండా కాస్త అలస్యంగానైనా అసలు విషయం చెప్పేశాడు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్. తాజాగా ఆయన కేవలం అసెంబ్లీ నియోజక వర్గాలలో శాంపిల్ సర్వే నిర్వహించి, ఆ ఫలితాలను తాజాగా జగన్‌కి వెల్లడించాడని సమాచారం. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మరలా తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పడంతో జగన్ షాకయ్యాయడట.
ఈ సర్వేప్రకారం ఇదే సమయంలో ఎన్నికలు వస్తే టిడిపికి 114 సీట్లు, వైసీపీకి 49, జనసేనకు 10కిపైగా సీట్లు, కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని తేల్చాడట. నాయకునిగా, సీఎంగా చంద్రబాబును ఓటర్లు బాగా నమ్ముతున్నారని, కానీ ఆయా నియోజక వర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు విసుగెత్తి ఉన్నారని ఆయన తేల్చాడు. స్థానిక టిడిపి ఎమ్మెల్యేల వైఫల్యాలను వైసీపీ ఇన్‌చార్జ్‌లు, ఆయా జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాష్ చేసుకోలేకపోతున్నారని ఇందులో తేలిదంటున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్‌ని జనాలు నమ్మడంలేదని, ఆయన ఎప్పుడు ఎవరిని పార్టీ నుంచి తొలగిస్తాడో? ఎవరిని కిందపడేస్తాడో అర్దం కాదని, దాంతో పార్టీకి నమ్మకంగా ఎవ్వరూ పనిచేయడంలేదని సమాచారం. అలాగే జగన్ రాజకీయలేమి, అనుభవ రాహిత్యం, సరైన దిక్సూచి,దిశానిర్దేశం చేసే వారు లేకపోవడం, టిడిపి వ్యతిరేకతను సొమ్ము చేసుకునే వ్యూహకర్తలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇక వైసీపీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉండటంతో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లను మారిస్తే వైసీపీ కాస్త సీట్లు పెరుగుతాయని ఆయన తేల్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన ప్రభావం బాగానే ఉంటుందని, కానీ ఒంటిరిగా పోటీ చేస్తే మాత్రం జనసేనకు 10నుంచి 12 సీట్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. ఇక జనసేన బలపడితే అది చివరకు అధికారపక్షమైన టిడిపి ఓట్లనే చీలుస్తుందని, గత ఎన్నికల్లో టిడిపి వెంట ఉన్న కాపులు జనసేన వైపు వెళ్తారని, కాబట్టి పవన్ విషయంలో భయమేమీ వద్దని సూచించాడని తెలుస్తుంది.
వైసీపీ... బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పడంతో వైసీపీ పట్ల మైనార్టీలలో కూడా జగన్ పట్ల వ్యతిరేక వచ్చిందని, ఇక బ్రాహ్మణులతో పాటు కొన్ని కులాల వారు టిడిపి వెంట ఉంటారని తేల్చాడట. ఇక ఈ సర్వే రిపోర్ట్ ఎంత వరకు కరెక్ట్ అని జగన్ ఆలోచన చేస్తున్నాడని, కానీ గత 2014 ఎన్నికల్లో బిజెపికి, ఆ తర్వాత బీహార్‌లో నితీష్‌కుమార్‌కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే కావడంతో కాస్త విశ్వసనీయత ఉండవచ్చని భావిస్తున్నారు.....!