ఒకప్పుడు తెలుగు పాత సినిమాలైన 'లవకుశ, పాతాలభైరవి, నర్తనశాల' వంటి చిత్రాల నిడివి 4గంటలకు పైగానే ఉండేది. నాడు ప్రేక్షకులు కూడా ఎంత పెద్ద నిడివి ఉన్న సినిమా అయితే తమ హీరోను అంతసేపు వెండితెరపై చూసుకోవచ్చని, మరో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడంతో ఓపిగ్గా నాలుగైదు గంటలు కూడా చూశారు. కానీ ట్రెండ్ మారింది. ప్రేక్షకులకు అంత సహనం నశించింది. రెండున్నర గంటల్లో సినిమా ముగించాలని, లేకపోతే ఎక్కువ నిడివి నష్టం చేస్తుందని భావిస్తున్నారు.
అదే పాతకాలంలో అయితే 'విశ్వరూపం1,2'లను 'బాహుబలి' రెండు పార్ట్‌లను ఓకే చిత్రంగా తీసేవారు. కానీ తెలివిగా రాజమౌళి ప్రేక్షకుల అభిరుచి, నిర్మాతలకు లాభాలు పేరుతో రెండు పార్ట్‌లుగా విడగొట్టి తన మాస్టర్ బ్రెయిన్‌ని చూపించాడు. ఇక తెలుగు సినిమా మూడుగంటలున్నరోజుల్లోనే హిందీ చిత్రాలు మన పాత చిత్రాలలాగా నాలుగైదు గంటలుండేవి. ఇక హాలీవుడ్ సినిమాలంటే ఒకటిన్నర గంటే రన్ టైం. అంతకు మించనివ్వరు. బాగా ఆడితే సీక్వెల్ తీసి క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటారు. ఇదేపోకడలో ఇప్పుడు తెలుగు సినిమా నిడివి భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలున్నాయి.
ఇక నిన్నటివరకు బాలీవుడ్ స్టార్స్ అందరి చిత్రాలు మూడున్నరగంటలుండేవి. ఇక సల్మాన్‌ఖాన్ నటించిన 'మైనే ప్యార్ కియా' నిడివి నాలుగు గంటలు. తాజాగా వచ్చిన 'దబాంగ్, దబాంగ్2, ప్రేమ్‌రతన్ ధన్‌పాయో, భజరంగీ భాయిజాన్, ఏక్‌థా టైగర్'ఇలా అన్నింటి నిడివి మూడున్నర గంటలు. ఇక తాజాగా విడుదలైన 'ట్యూబ్‌లైట్' నిడివి దాదాపు మూడుగంటలు వచ్చేసరికి దానిని ట్రిమ్ చేసి మన సినిమాలలాగా రెండున్నర గంటలకే కుదించారట. సినిమా హిట్టయితే ఎడిట్ చేసిన సీన్స్‌ని మరలా కలుపుతామని యూనిట్ అంటోంది. కాగా ఇండో చైనా వార్ నేపథ్యంలో 1962 నాటి కాలం నాటి ఈ బ్యాగ్రౌండ్ మూవీ ఇప్పటివరకు రాని బ్రదర్ సెంటిమెంట్ హైలెట్ అంటున్నారు.
యుద్దానికి సైనికునిగా వెళ్లిన తన సోదరుడు యుద్దంలో మరణించాడో , బతికున్నాడో తెలియక, సోదరుని కోసం భావోద్వేగాలలో ఓ అమాయకుడి ఎదురు చూపులు మనసుని తాకుతాయంటున్నారు. ఇక అదే సమయంలో ఓ చైనా యువతిని ప్రేమించిన బుద్దిమాంద్యం కలిగిన యువకుడు ఎన్ని కష్టాలు, బాధలు పడ్డాడనే గాథ ఇది. కానీ ఎడిట్ వల్ల ఈ చిత్రంలోని చాలా హృద్యమైన సీన్స్‌కి తీసేయడం తనకు బాధ కలిగించిదంటూ సల్మాన్ ప్రమోషన్స్‌లో సెంటిమెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే ఇక నుంచి వచ్చే బాలీవుడ్ చిత్రాలు కూడా మన తెలుగు చిత్రాలలానే రెండుగంటలు, రెండున్నర గంటలే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.