సినిమాల్లో కొన్ని ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కామెడీ, సెంటిమెంట్, థ్రిల్లర్.. ఇలా. వీటి లిస్ట్‌లో చేర్చగలిగింది ఫాంటసీ, నిజమైన మానవులు చేయలేని వారు వెండితెరపై అద్భుతాలు చేస్తుంటే వాటిని చూసి చిన్నారులే కాదు.. అన్ని వర్గాల వారు లాజిక్కులు మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు. నాటి ఎన్టీఆర్ 'పాతాళభైరవి, యమగోల' నుంచి చిరంజీవి 'జగదేకవీరుడు-అతిలోక సుందరి', జూనియర్‌ఎన్టీఆర్ 'యమదొంగ', అలీ 'యమలీల' వంటివి ఆ తరహా చిత్రాలే.
ఇక సైన్స్‌ఫిక్షన్ అనే పదాన్ని జోడించి హాలీవుడ్ చిత్రాలు ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసి, కలెక్షన్ల వర్షం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ఫాంటసీ ఫిల్మ్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఈ చిత్రంలో యువహీరో సందీప్‌కిషన్, స్టార్ హీరోయిన్ శ్రియల జంట జోడీ కడుతోంది. ఈ చిత్రం టైటిల్‌ను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు.
తమిళంలో 'నరగసురన్' అనే టైటిల్ పెట్టగా తెలుగులో 'నరకాసురుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో అరవింద్ స్వామితో పాటు ఇంద్రజిత్ వంటి ముఖ్యతారాగణం నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని గౌతమ్‌మీనన్ నిర్మిస్తుండటం విశేషం. మొదట ఈ చిత్రంలో నాగచైతన్య నటించడానికి ఓకే చెప్పాడు. కానీ కాల్షీట్స్ అని, ఇతర కారణాలతో దాని నుండి బయటకువచ్చాడు. మరి చైతూ నో చెప్పిన ఈ చిత్రం ఏమేరకు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తుందో వేచిచూడాల్సివుంది.