అల్లు అర్జున్ నటించిన 'డీజే' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ తో, సాంగ్స్ తో ఉర్రూతలూగిస్తున్న 'డీజే' కు ఇంకా సమస్యలు వీడలేదు. డీజే సాంగ్ లో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్నిపదాలు ఉన్నాయని.... ఆ పాట విడుదలైనప్పటినుండి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 'డీజే' లో అల్లు అర్జున్, పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన 'గుడిలో బడిలో ఒడిలో.... ' పాటలో 'నమకం, చమకం' అంటూ కొన్ని పదాలు బ్రాహ్మణులను కించ పరిచే విధంగా ఉన్నాయని.... వాటిని తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించడమే కాక సెన్సార్ బోర్డు కి కూడా కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే హరీష్ శంకర్ మాత్రం తాను ఒక బ్రాహ్మణుడునని బ్రాహ్మణులను కించపరిచే విధంగా మేమెందుకు సినిమా తీస్తామని... సినిమా విడుదలయ్యాక దాని గురించి చర్చిద్దామని చెప్పాడు. అయినా వారు వినకపోయేసరికి 'డీజే' నిర్మాత దిల్ రాజు దిగొచ్చి ఆ పాటలో పాదాలను మారుస్తునట్టు ప్రకటించాడు. మరి దిల్ రాజు మారుస్తామని చెప్పాడే కానీ ఆ పదాలను... ఆ పాట నుండి ఇప్పటివరకు తొలగించలేదని... ఈ విషయంలో 'డీజే' చిత్ర యూనిట్ తమని మోసం చేసిందని బ్రాహ్మణ సంఘాలు వారు ఆరోపిస్తున్నారు.
అందుకే ఈ మంగళవారం బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలసి 'డీజే' చిత్రంపై పాటలోని అభ్యంతరకర పదాలపై కంప్లైంట్ చేశారు. ఆ పాటలోని అభ్యంతరకరంగా ఉన్న 'నమకం, చమకం' అనే పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నికోరారు. మరి సినిమా విడుదలకు ఎంతో సమయంలేదు. ఇలాంటప్పుడు ఈ వివాదాలు 'డీజే' కి అవసరమా? వారు అడిగిన వాటిని మారుస్తామని చెప్పిన వాళ్ళు మార్చేస్తే పోయేది. ఈ గొడవ సద్దుమణిగేది. మరి అలా చేయకుండా మళ్ళీ సమస్యని కెలుక్కుంది 'డీజే' చిత్ర యూనిట్. మరి ఈ సమస్యనుండి ఎలా బయటపడతారో చూద్దాం.