ఇప్పుడు బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, దేశంలో ఏది తినకూడదు? ఏది తినవచ్చు? అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. గో మాసం వంటివి తినకూడదని కొన్ని ప్రభుత్వాలు అంటుంటే... ఎందుకు తినకూడదు? మిగిలిన కోడి, గొర్రె, పొట్టేలు మాంసం తినవచ్చా? ఏమి వాటికి ప్రాణం లేదా? అనే చర్చ నడుస్తోంది. ఇక విషయానికి వస్తే ఇటీవల రిలీజైన 'డిజె'లోని 'ఒడిలో మడిలో గుడిలో' పాట విషయంలో పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. నమకం, చమకం... వంటివి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే చెందిన పదాలని ఎక్కడైనా కాపీ రైట్స్‌లో ఉందా? అని కొందరు అభిప్రాయపడుతుంటే... ఇది కేవలం బ్రాహ్మణులను మాత్రమే కించపరచడం కాదు.. ఏకంగా హిందు పురాణాలను, వేదాలను అవమానించినట్లేనని కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కొందరు చెబుతున్నారు. ఇక ఆ పాట పుణ్యమా అని స్వయంగా బ్రాహ్మణుడు, వైదికుడు అయిన హరీష్‌శంకర్‌ని, కాస్త భక్తి ప్రవత్తులు, హిందు పద్దతులు తెలిసిన దిల్‌రాజుని కూడా ఈ పాట వివాదాలలోకి లాగింది.
ఇక తాజాగా 'డిజె' ఆడియో వేడుకలో హరీష్‌శంకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మరలా చర్చనీయాంశం అయ్యాయి. బ్రాహ్మణులు మాంసం తినరు కాబట్టే అంత స్వచ్చంగా మాట్లాడగలుగుతారని హరీష్‌శంకర్ ఆ వేదికలో వ్యాఖ్యానించాడు. ఇక ఈ చిత్రం సందర్బంగా హరీష్‌శంకర్‌ని బన్నీ 'మీరు ఇంత స్వచ్చంగా, స్పష్టంగా ఉచ్చరణ ఎలా చేయగలుగుతున్నారని' హరీష్‌శంకర్‌ని అడిగాడట. దానికి హరీష్ మాంసం తినము కాబట్టే అని చెప్పిన సమాధానం చూసి ఈ చిత్రంలో బ్రాహ్మణుల స్లాంగ్ బాగా మాట్లాడటం కోసం బన్నీ తాను నాన్‌వెజ్ మానేస్తానని మానేసిన విషయాన్ని హరీష్‌శంకర్ చెప్పారు. దాంతో మాంసం తినని వారే గొప్పవారా? మాంసం తినే వారంతా దద్దమ్మలా? అని కొందరు ప్రశ్నిస్తున్న వ్యవహారంతో మరలా హరీష్‌శంకర్ హాట్ టాపిక్ అయ్యాడు.
నిన్నటిదాకా అందరూ ఆయన్ను బ్రాహ్మణ, హిందు ద్వేషి అన్నారు. మరి ఇప్పుడు మిగిలిన వారు బ్రాహ్మణులు పక్షపాతి అంటున్నారు. ఏం ఈ దేశంలో ఎవరి మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇదంతా ఎందుకంటే మందు అలవాటు ఉన్నవాడు సరిగా ఆలోచించలేడు. సరిగా మాట్లాడలేడు.. అన్నంత మాత్రాన తప్పేమిటి? పురాణాల నుంచి పాత కాలం నాటి పెద్దల వరకు ఎవరు పడితే వారు పుట్టుకతో బ్రాహ్మణులు కాదని, బ్రహ్మజ్ఞానం తెలిసి, సౌకర్యవంతమైన, మంచి ఆహారం తిని సాత్వికంగా ఉండే వారు జంధ్యం లేకపోయినా బ్రాహ్మణుడే అనిచెబుతున్నారు. మానవ సృష్టి ప్రకారం మానవుల దంతాలు మాంసం తినడానికి అనుకూలంగా ఉండవని, పులి, సింహాలు, ఇతర మాంసాహార జంతువుల నోటి నిర్మాణ విధానాన్ని, మానవులు దంత నిర్మాణ విధానాన్ని చూపిస్తూ ఎంతో కాలంగా మంతెన సత్యనారాయణరాజు నుంచి ఎందరో మేధావులు సాత్వికాహారం గురించి చెబుతూనే ఉన్నారు.
దీనివల్ల మనసు, ఆలోచన, కడుపు అన్ని సౌకర్యంగా ఉంటాయని తెలిసే ఎంతో మాంసప్రియులైనప్పటికీ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి 'రుద్రవీణ' వరకు, బన్నీ'డిజె' వరకు ఆ పాత్ర పోషించినంత కాలం తాము నాన్ వెజ్ తినలేదని, పడక సుఖం కూడా ఎరుగక, చాపలపై నిద్రపోయే వారిమని చెబుతూ వస్తున్నారు. మరి స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి అందరూచెప్పిన విషయం బన్నీ చెబితే ఇంత రాద్దాంతం చేయడం అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయినా ఇలాంటి వివాదాలు సమాజానికి ఏమీ ఉపయోగపడని ఊసుపోని కబుర్లని చెప్పినా వినే వారెవ్వరూ లేరు...?