పవన్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'తమ్ముడు' చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇక ఓ హీరోకి ఫారిన్ అబ్బాయిలు కలిపి కదం తొక్కడం అప్పట్లో భలే కొత్తగా అనిపించింది. ఇక పంచె కట్టిన తీరు, తలకు తలపాగాలాగా చుట్టిన కర్చీఫ్, నోట్లో బీడీతో పవన్ కనిపించిన తీరు ఓ స్పెషల్. ఈ పాటలోని పవన్ గెటప్‌ని చూసి యూతే కాదు.. అందరూ ఉర్రూతలూగిపోయారు. థియేటర్లలో స్క్రీన్ ముందు చిందులేసి ఆడిపాడారు. నాడు అదొక కొత్త స్టైల్‌గా మారింది. ఇక నితిన్ విషయానికి వస్తే ఆయన పవన్‌కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది తెలిసిందే.
పవన్ చిత్రంలోని 'తొలిప్రేమ'లోని పాటను రీమిక్స్ చేయడం నుంచి, పవన్ సినిమాలలోని పాటల లిరిక్స్‌ను తన చిత్రాలకు టైటిల్స్‌గా వాడుకుంటూ ఉంటాడు. ఈయనకు పవన్‌పై ఎంత అభిమానముందో పవన్‌కి కూడా ఈ తమ్ముడు అంటే అంతే అభిమానం, సామాన్యంగా ఇతర ఏ హీరో ఆడియో ఫంక్షన్లకు పవన్ హాజరుకాడని అందరికీ తెలిసిందే. కానీ నితిన్ వరుస ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు పవన్ అతని వేడుకకు వచ్చి నితిన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంకేముంది.. పవన్ అభిమానులు కూడా నితిన్‌ని బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అలా హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్‌కి నితిన్.. పవన్‌కి,ఆయన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
కాగా ఇటీవల మరలా కెరీర్‌లో కాస్త వెనుకబడిన నితిన్ ప్రస్తుతం 'కృష్ణగాడి వీరప్రేమగాధ'తో టాలెంట్ ఉన్న దర్శకునిగా పేరుతెచ్చుకున్న హనురాఘవపూడి దర్శకత్వంలో 'లై' ( అబద్దం) అనే చిత్రం చేస్తున్నాడు. 14రీల్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌లో ఎక్కువ భాగం అమెరికాలో జరుపుకుంది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని విధంగా నితిన్ ఈ చిత్రంలో హైదరాబాద్ పాతబస్తీ యువకునిగా గుబురు గడ్డంంతో కనిపిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు నితిన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయనకు మాస్ ఇమేజ్ రాలేదు.
కానీ 'లై' (అబద్దం) చిత్రంలో మరోసారి నితిన్‌ని చూస్తుంటే ఆయన మరోసారి మాస్ అండ్‌యాక్షన్ చిత్రం చేస్తున్నాడని అనిపిస్తోంది. కాగా ప్రస్తుతం పవన్ అభిమానుల వద్ద 'లై' చిత్రంలో పవన్ 'తమ్ముడు'లాగా పంచెకట్టి, తలపాగాలాగా కర్చీఫ్ చుట్టుకుని, బీడీ నోట్లో పెట్టుకున్న నితిన్ బొమ్మలు బాగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ సాయంతో ఇప్పటికే సాఫ్ట్ లవ్ క్యారెక్టర్లలో పేరు తెచ్చుకుని, సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలు సాధించిన నితిన్ 'లై'తో మాస్ హీరోగా కూడా బోణీ కొట్టి హిట్‌ట్రాక్‌లోకి రావాలనిపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మాత్రం కనిపిస్తోంది. మరి నితిన్ కోరిక ఏమేరకు నిజమవుతుందో వేచిచూడాల్సివుంది...!